ప్రధాని మోడీపై కామెంట్స్ ఎఫెక్ట్.. ముగ్గురు మాల్డీవ్స్ మంత్రులపై వేటు

by Hajipasha |
ప్రధాని మోడీపై కామెంట్స్ ఎఫెక్ట్.. ముగ్గురు మాల్డీవ్స్ మంత్రులపై వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవ్స్‌కు చెందిన ముగ్గురు మంత్రులపై వేటుపడింది. వివాదాస్పద కామెంట్స్ చేసిన మంత్రులు మరియం షియునా, మల్షా, హసన్ జిహాన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌పై, అక్కడి నాయకులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరికలు జారీ చేసింది. లక్షద్వీప్‌లోని ఒక బీచ్‌‌ను ప్రధాని మోడీ సందర్శించిన అంశంపై ఒక మంత్రి ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టిన అంశంపై స్పందించిన మాల్దీవుల ప్రభుత్వం.. అవన్నీ సదరు మంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలని ప్రభుత్వంతో అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. మాల్దీవ్స్ సర్కారు సీరియస్ కావడంతో మంత్రి మరియం షియునా భారత్‌కు వ్యతిరేకంగా చేసిన పోస్ట్‌లను డిలీట్ చేశారు. ఇంతకుముందు ఆమె చేసిన వివాదాస్పద ట్వీట్‌లలో భారత ప్రధాని మోడీపై జోకర్, ఇజ్రాయెల్ కీలుబొమ్మ వంటి అభ్యంతరకర పదాలను ప్రయోగించారు. ఇలాంటి పదాలను వాడటంపై భారత నెటిజన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యక్షుడు ఏమన్నారంటే..

ఈ పోస్టులపై స్పందించిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్.. ‘‘ఆ వ్యాఖ్యలు భయంకరమైనవి. అలాంటి కామెంట్స్ నుంచి దూరంగా ఉండాలి’’ అని దేశాధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సారథ్యంలోని ప్రభుత్వానికి హితవు పలికారు. కీలకమైన మిత్రదేశానికి ప్రాతినిధ్యం వహించే నేతపై ఇలాంటి కామెంట్స్‌ను ఆపాలని సూచించారు. ఈ కామెంట్స్‌ను మాల్దీవ్స్ మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ కూడా ఖండించారు. ‘‘మాల్దీవుల రేంజ్‌లో లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని డెవలప్ చేయలేరు. ఇండియాలోని హోటళ్ల రూములు కంపు కొడతాయి’’ అంటూ మాల్దీవ్స్‌కు చెందిన ఒక ఎంపీ పెట్టిన పోస్టుపైనా భారత నెటిజన్స్ మండిపడుతున్నారు. అహంభావం సరికాదని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed