విప్లవ కవి వరవరరావుకు బెయిల్ మంజూరు

by Anukaran |   ( Updated:2021-02-22 02:25:58.0  )
విప్లవ కవి వరవరరావుకు బెయిల్ మంజూరు
X

దిశ,వెబ్‌డెస్క్: విప్లవ కవి వరవరరావుకు 6 నెలల పాటు బెయిల్ మంజూరైంది. భీమా కోరేగావ్‌ కుట్ర కేసులో నిందితులుగా ఉన్న వరవరరావుతో పాటు షోమాసేన్‌ మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌ పిటిషన్ పై బొంబాయి హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్ వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయడంలో తప్పులేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆరునెలల పాటు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

మావోయిస్ట్‌లతో కలిసి రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర చేశారనే అభియోగాలతో విప్లవ కవి వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

2018 జనవరిలో మహారాష్ట్రలోని బీమా కోరెగావ్ వద్ద దళిత సైనికులు, బ్రిటీషర్లతో కలిసి పీష్వారాజుల సైన్యంపై పోరాడి విజయం సాధించిన ఘట్టానికి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఎల్గార్ పరిషత్’ పేరుతో కొందరు దళిత, వామపక్ష కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం చివరకి అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అల్లర్లకు హక్కుల కార్యకర్తలైన రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, సుధీంధ్ర గాండ్లింగ్, ప్రొఫెసర్ షోమాసేన్, మహేశ్ రౌత్‌లే కారణమంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అనంతరం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రోనా విల్సన్ దగ్గర రాజీవ్ గాంధీ తరహాలో మోడీని హత్య చేసేందుకు కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఓ లేఖ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. మోడీ హత్యకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయని, అందుకు అవసరమైన ఆర్ధిక సాయం వరవరరావే చూసుకుంటారనట్లు ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, ఆ లేఖ పోలీసుల కల్పితమని వరవరరావు ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజయ్ నిరూపమ్ వంటి నేతలతో పాటు అనేక హక్కుల సంఘాలు, రచయితల సంఘాల నేతలు ఆ లేఖ కల్పితమని విమర్శించారు.

వరవరరావుకు కరోనా

భీమా కోరేగావ్‌ కుట్ర కేసులో అరెస్టైన విప్లవ కవి వరవరరావు 22 నెలలకు పైగా ముంబైలోని తలోజా జైల్లో ఉన్నారు. అయితే జైలు శిక్షను అనుభవించే సమయంలో 2020, మే నెలలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వరవరరావును అత్యవసర చికిత్స కోసం జేజే (సర్ జంషెడ్జీ జీజీభాయ్) ఆస్పత్రికి తరలించారు. అయితే ట్రీట్మెంట్ పూర్తికాకుముందే మళ్లీ జైలుకు తరలించారు. కరోనా వ్యాప్తినేపథ్యంలో గతేడాది జులై 16న మరోసారి అస్వస్థతకు గురైన వరవరరావును జైలు అధికారులు జేజే ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అక్కడ కరోనా టెస్టులు చేయగా అందులో వరవరరావుకు వైరస్ సోకినట్లు తేలింది.

షరతులతో కూడిన బెయిల్

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనని విడుదల చేయాలంటూ వరవరరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పలుమార్లు బెయిల్ తిరస్కరణకు గురైనా…, తాజాగా బొంబాయి హైకోర్ట్ వరవరరావుకు 6 నెలల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరవరరావును నానావతి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. ముంబైలోనే ఉండి, అవసరమైనప్పుడల్లా దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలే డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed