కేఫ్ ఓనర్‌గా నీలి కళ్ల చాయ్‌వాలా!

by Anukaran |
కేఫ్ ఓనర్‌గా నీలి కళ్ల చాయ్‌వాలా!
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా కారణంగా ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ పొందేస్తున్నారు. అయితే అలా వచ్చిన పాపులారిటీని తమ సొంత ప్రయోజనాలకు సన్మార్గంలో ఉపయోగించుకునేవాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. మిగతా వాళ్లందరికీ ఎంత త్వరగా పాపులారిటీ వచ్చిందో అంతే త్వరగా పోతోంది కూడా. కానీ అందరి విషయంలో అలా కాదు. పాపులారిటీని బాగా ఉపయోగించుకుని లైఫ్‌లో స్థిరపడే వాళ్లు కూడా ఉంటారు. అందుకు చక్కని ఉదాహరణగా పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ ఖాన్‌ను చెప్పుకోవచ్చు. అక్కడి ఇస్లామాబాద్‌లోని సండే బజార్‌లో అతను చాయ్‌వాలాగా పనిచేసేవాడు. ఒకసారి అటుగా వచ్చిన ఫొటోగ్రాఫర్ జవేరియా కంట్లో పడ్డాడు. జవేరియా తీసిన ఫొటోలు 2016లో బాగా వైరల్ అయ్యాయి. నీలి కళ్లతో మాయ చేస్తున్న చాయ్‌వాలా అంటూ కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. మరి ఇంత అందగాడిని బ్రాండ్‌లు వదిలిపెడతాయా?

వెంటనే నాలుగైదు ప్రకటనల కాంట్రాక్టులు అర్షద్ ఖాన్ ఇంటి ముందుకు వచ్చాయి. తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లు మోడలింగ్ కూడా చేశాడు. లండన్ మేగజైన్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించే పురుషుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత సడన్‌గా కనిపించకుండాపోయాడు. సోషల్ మీడియా సంగతి తెలిసిందే కదా.. పాపులర్ చేస్తారు కానీ తర్వాత పట్టించుకోరు. ఈ విషయం అర్థం చేసుకున్న వారు సోషల్ మీడియా పాపులారిటీ మాయలో పడిపోకుండా జీవితాన్ని చక్కబెట్టుకుంటారు. అర్షద్ కూడా అచ్చం అలాగే చేశాడు. జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. ప్రకటనలు, మోడలింగ్ ద్వారా తాను సంపాదించిన డబ్బుతో ఇప్పుడు ఇస్లామాబాద్‌లో ఒక కేఫ్ ప్రారంభించాడు. దానికి ‘కేఫ్ చాయ్‌వాలా’ అని పేరు పెట్టాడు. చాయ్‌వాలా అనే పదాన్ని తీసేయాలని చాలా మంది అతనికి సలహా ఇచ్చారు. కానీ తనకు జీవితాన్నిచ్చిన ఆ పదాన్ని తొలగించడానికి మనసు రాలేదని అర్షద్ అంటున్నారు.

Advertisement

Next Story