‘బ్లాక్ కింగ్’ కేరాఫ్ మేళ్లచెరువు

by Shyam |   ( Updated:2020-05-18 23:00:00.0  )
‘బ్లాక్ కింగ్’ కేరాఫ్ మేళ్లచెరువు
X

దిశ, నల్లగొండ: ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. జిల్లాలో సాగే అక్రమ దందాలన్నీ అతడి కనుసన్నల్లోనే. అంతెందుకు పీడీఎస్ బియ్యం దగ్గర్నుంచి అటవీ భూముల ఆక్రమణల వరకూ సర్వాంతర్యామి. అధికార గణం సైతం ఆయనకు వంత పాడాల్సిందే.. లేకుంటే అంతే సంగతి. అందుకే అతడిని ఇక్కడ ‘బ్లాక్ కింగ్’గా పిలుస్తారు. అక్రమ దందాకు కేరాఫ్ గా నిలిచిన హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువులోని బ్లాక్ కింగ్‌పై ‘దిశ’ ప్రత్యేక కథనం.

హుజూర్ నగర్ నియోజకవర్గం అంతా కృష్ణా పరీవాహక ప్రాంతం. మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకీడు, చింతలపాలెం.. ఇవి కృష్ణానదిని అనుకుని ఉంటాయి. ఈ మండలాల్లో జరిగే ప్రతిదందాకు మేళ్లచెరువు కేంద్రంగా ఓ ప్రజాప్రతినిధి దగ్గరి బంధువు నడిపించడంలో సిద్ధహస్తుడు. దానికితోడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడం అక్రమార్కులకు వరంగా మారింది. బ్లాక్ కింగ్ ఆధ్వర్యంలో ముఠాలుగా ఏర్పడి.. దందాలను కొనసాగిస్తున్నారు. రేషన్ బియ్యం నుంచి భూకబ్జాల వరకు వారి అక్రమాలకు అంతులేకుండా పోతోన్నది. ఓ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు కావడం.. పైగా అధికార పార్టీ కావడంతో స్థానికంగా ఉండే రాజకీయ నేతలు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు అతడి అక్రమ లీలలపై నోరు మెదిపేందుకు జంకుతున్నారు.

అన్ని అక్రమాలకు కేంద్రం ఇదే..

హుజూర్ నగర్ నియోజకవర్గం అక్రమ దందాలకు అడ్డాగా మారింది. నియోజకవర్గంలో లిక్కర్, రేషన్ బియ్యం, గుట్కా, ఇసుక మాఫియా, ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, జూదం.. ఇలా ఒక్కటేమిటి ఎన్ని అక్రమాలు ఉన్నాయో.. అన్నీ ఇక్కడ జోరుగా సాగుతున్నాయి. లిక్కర్, రేషన్, పేకాట, ఇసుక, గుట్కా ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు మాత్రం మఠంపల్లిలోనే చూపిస్తున్నాయి. మఠంపల్లి నుంచి పెద్ద ఎత్తున మద్యం ఏపీకి తరలిస్తూ పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఇక్కడ పేకాట స్థావరాలు బయటపడ్డాయి. ఇటీవలే రెండు డీసీఎంలలో మఠంపల్లి నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 165 క్వింటాళ్ల రేషన్ బియ్యం మేళ్లచెరువు శివారులో పట్టుబడ్డాయి. ఇదంతా గతంలో రేషన్, గుట్కా దందాలో పీడీ యాక్ట్ నమోదు అయిన ఓ వ్యక్తి నడుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యక్తి వెనుక సదరు బ్లాక్ కింగ్ (టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి దగ్గరి బంధువు) హస్తం ఉన్నట్టు తెలుస్తోన్నది.

ఏపీకి రూ. 3 కోట్ల మద్యం తరలింపు

కరోనా వైరస్ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మద్యానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌లోని నాలుగు మద్యం దుకాణాల నుంచి రూ. కోటి మద్యాన్ని హుజూర్ నగర్ ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి మూడు రెట్లకు అధికంగా ఏపీకి తరలించి రూ.3 కోట్లకు మద్యాన్ని విక్రయించారు. ఏపీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉండడంతో ప్రస్తుతం నాటు పడవల ద్వారా అక్కడికి మద్యాన్ని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని విస్సన్నపేటలో భారీగా మద్యం పట్టుబడింది.

నెలకు రూ.10 లక్షలు కప్పం

పీడీఎస్, గుట్కా దందా నడుపుతున్నందుకు నెలకు రూ.10 లక్షలు చొప్పున ఓ రాజకీయ నేతకు కప్పం కడుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోన్నది. ఈ దందా మా కంటే మాకు ఇప్పించాలని పలువురు నాయకులు ఆ బడా నేతతో పలుమార్లు గొడవ పడ్డారంటే.. ఈ దందా ఏ స్థాయిలో కాసులు కురిపిస్తోన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి అధికారులు ఈ దందాలో పనిచేస్తున్న డ్రైవర్లు, కూలీలపైనే కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కానీ, ఈ దందాకు అసలైన సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాత్రికి రాత్రే ఫారెస్ట్ భూములు మాయం

మఠంపల్లి మండలం రఘునాథపాలెం, చింతలపాలెం, పాలకీడు మండలాల్లో అటవీ శాఖ భూములు అధికంగా ఉంటాయి. వీటికి సరిహద్దులు స్పష్టంగా ఉండవు. అయితే ఈ బ్లాక్ కింగ్ ముఠా రాత్రికి రాత్రే చెట్లను నరికి ట్రాక్టర్లతో మట్టి పోయించి చదును చేస్తారు. అటవీ భూమిని కాస్తా కబ్జా చేసేస్తున్నారు. ఇదంతా అటవీ శాఖ అధికారులకు తెలిసినా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుంటుండడంతో వారు ఏం చేయలేకపోతున్నారు. ఈ మూడు మండలాల పరిధిలో వందల ఎకరాల అటవీ శాఖ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం.. అటు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బ్లాక్ కింగ్ అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story