GHMC : బీజేపీ ఫ్లోర్ లీడర్ చాన్స్ దక్కేదెవరికో..?

by Shyam |
bjp-corporators
X

దిశ, తెలంగాణ బ్యూరో : బల్దియా(GHMC) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనివిధంగా నువ్వా నేనా అన్నట్లు సాగాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. 150 కార్పొరేటర్లలో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్ పదవికి సైతం పోటీ పడింది. అయినప్పటికీ ఇప్పటివరకు బల్దియాలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌ను మాత్రం అధిష్టానం ప్రకటించలేదు. ఆ పదవి కోసం నిత్యం కార్పొరేటర్లు రాష్ట్ర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం నేటికి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఎవరికి ఫ్లో‌ర్ లీడర్ ఇస్తే వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చుట్టూ కార్పొరేటర్లు ప్రదక్షిణం చేస్తున్నారు. బల్దియా సమావేశాలలో బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే వారే కరువయ్యారు. కార్పొరేటర్లు తమ పరిధిలోని సమస్యలను మాత్రమే ఫ్లోర్‌ మీటింగ్‌లో ప్రస్తావిస్తూ ఉండటం గమనార్హం.

టీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పుకునే పార్టీ ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్‌ను ఎందుకు ఎన్నుకోలేదనే చర్చ ప్రస్తుతం బల్దియాలో నడుస్తుంది. ఏ పార్టీ అయినా బల్దియా సమావేశాలకు ముందే తమ కార్పొరేటర్‌లతో సమావేశం నిర్వహించి అందులో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా నియమిస్తుంది. మాట్లాడే సమస్యలపై దిశానిర్దేశం చేస్తుంది ఆ పార్టీ అధిష్టానం. కానీ అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తుంది. దీంతో గ్రేటర్ సమస్యలు, ప్రజా సమస్యలపై మాట్లాడేవారే కరువయ్యారు. అధిష్టానం ఆలస్యం చేస్తుండటంతో కార్పొరేటర్లలో అసహనం పెరిగిపోతుందని సమాచారం. గెలిచిన కార్పొరేటర్లు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణం చేసి.. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొందామనుకుంటే నేటికి ఫ్లోర్ లీడర్ ఎన్నిక జరగకపోవడం వారిలో నిరుత్సాహన్ని నింపుతుంది.

బీజేపీ ఓ రికార్డు..

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి జరిగిన బల్దియా ఎన్నికల్లో 48 కార్పొరేటర్ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, లింగోజిగూడ కార్పొరేటర్ మృతితో 47 స్థానాలతో టీఆర్ఎస్ తర్వాత బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గ్రేటర్‌లో పార్టీ బలంగా ఉంది. కానీ ఫ్లోర్ లీడర్ ఎన్నికల్లో మాత్రం కెప్టెన్ లేని జట్టుగా మిగిలిపోయింది. దీంతో కార్పొరేటర్లు ఎవరికివారే తమ సమస్యలను సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ఇలా ఉండటంతో ఇటు అధికారులు గానీ, అటు మేయర్ గానీ.. వీళ్లు ప్రస్తావిస్తున్న అంశాలపై అంతగా స్పందించడం లేదని తెలుస్తోంది.

దేవర కర్ణాకర్..? లేదా శంకర్ యాదవ్..?

బల్దియా ఫ్లోర్ లీడర్ పదవి కోసం గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కర్ణాకర్, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరు కాకుండా మరికొంత మంది పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా వీరి పైనే చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరని నియమిస్తారనేది పార్టీ అధిష్టానం తేల్చాల్సి ఉంది. వీరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ బల్దియా ఫ్లోర్ లీడర్ నియామకంలో పార్టీ అధిష్టానం ఆలస్య ధోరణి విడనాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story