- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ దుబ్బాక సీన్ రిపీట్ అయ్యేనా?
దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో గెలుస్తామన్న ధీమా బీజేపీ నేతల్లో లేకపోయినా ఆ టార్గెట్ ప్రకారమే వ్యూహాన్ని రూపొందిస్తోంది. అన్నీ కలిసొచ్చి ఇక్కడ గెలిస్తే సంతోషం… లేదంటే కనీసం తక్కువ మార్జిన్‌తో రెండో స్థానంలో నిలవాలనుకుంటోంది. కానీ, కాంగ్రెస్‌ను మాత్రం ఇక్కడ వీలైనంతగా తొక్కేయాలనుకుంటోంది. సుదీర్ఘకాలం పాటు జానారెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిత్యం వహించడంతో వ్యక్తిగతంగా ఆయనకు పలుకుబడి ఉందని, ప్రస్తుతం టీఆర్ఎస్ సిట్టింగ్‌గా ఉన్నందున పార్టీ పరంగా ఇక్కడ బలం ఉందని బీజేపీ అంచనా వేసింది. అందుకే గెలుపుకోసం ప్రయత్నించినా అది సాధ్యం కాకుంటే కనీసం రెండో స్థానానికి పరిమితం అవుదామన్న అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని సమాధి చేయడమే బీజేపీ తొలి లక్ష్యంగా ఉంది. దుబ్బాకలో ఒక మేరకు సక్సెస్ అయింది. జీహెచ్ఎంసీలో ఇంకొంత మెరుగైన ఫలితాన్ని సాధించింది. నాగార్జున సాగర్ విషయంలో కాంగ్రెస్ ప్రతిష్టను మరింత దెబ్బతీయాలనుకుంటోంది. జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నారంటూ వార్తలను సృష్టించడం రాజకీయంగా మైండ్ గేమ్ ఆడటంలో భాగమేనని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. స్వయంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయే తాము జానారెడ్డితో టచ్‌లో లేమని, ఆయన కూడా తమను సంప్రదించలేదని చెప్పారు. జానారెడ్డి వైపు నుంచి కూడా స్పష్టత వస్తే సస్పెన్స్ వీడిపోతుంది.
నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలోనూ బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జానారెడ్డి స్వయంగా బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసేటట్లయితే ఈ పార్టీ నేతల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండవు. కానీ, ఆయన కొడుకు లేదా గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నివేదిత మళ్లీ పోటీచేస్తే మాత్రం పార్టీలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు తప్పవని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగానే ఉన్నా నిర్ణయాత్మకంగా మారేది మాత్రం యాదవులేనని, అందువల్ల ఈసారి యాదవ సామాజికవర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వడం ఉత్తమంగా ఉంటుందని బీజేపీలోని రెండో వర్గం వాదన. కానీ ఒక వర్గం మాత్రం గతంలో పోటీచేసిన అభ్యర్థి నివేదితకే ఇవ్వాలని అభిప్రాయపడుతోంది.
ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో గెలుపుపై బీజేపీ ధీమాగా లేదు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో ఉన్నంత నమ్మకం నాగార్జునసాగర్ విషయంలో కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపిక విషయం గురించి బండి సంజయ్‌తో పాత్రికేయులు ప్రస్తావించినప్పుడు కూడా ‘సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన రోజుల వ్యవధిలోనే ఇలాంటి విషయాలను మాట్లాడటం సమంజసం కాదు. నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడే మేం తొందరపడదల్చుకోలేదు. దానిపై పార్టీలో పెద్దగా చర్చ కూడా జరగరాదని అనుకున్నాం’ అని రెండు రోజుల క్రితం వివరణ ఇచ్చారు.