పెట్రోల్ రేట్లు తగ్గించకపోతే రోడ్లపై నిలదీస్తాం.. గులాబీ నేతలకు యెండల వార్నింగ్

by Shyam |
BJP leader Yendala Laxminarayana, criticized, TRS government, Etela Rajender, Huzurabad by-election
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: హుజురాబాద్‌లో రూ.600 కోట్లు ఖర్చు చేసి టీఆర్ఎస్ భంగపడిందని, ఈటల గెలుపు నియంతృత్వ పాలనకు చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం యెండల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో జరిగిన ఎన్నికలను తలపించేలా హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగిందన్నారు. ధర్మం వైపు నిలబడి ఈటల గెలుపునకు సహకరించి, తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించిన హుజురాబాద్ ప్రజలందరికీ యెండల ధన్యవాదాలు తెలిపారు. పెట్రోల్ ధరల విషయంలో టీఆర్ఎస్ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించకుంటే గులాబీ నాయకులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు.

గతంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సమయంలో కొనుగోలు చేయక రైతులు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రైతు ధాన్యం రాశిపై చనిపోయాడని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మక్కల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిధాన్యం, మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపులో కీలక పాత్ర పోషించిన యెండల లక్ష్మీనారాయణను బీజేపీ ఇందూరు కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామియాదవ్, బీజేపీ నాయకులు యెండల సుధాకర్ పటేల్, ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, నాగరాజు, విఘ్నేశ్, గంగాధర్, నరేందర్, పోలీస్ శ్రీను, రషీద్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed