పోలీసుల సాయంతో బీజేపీ నేతలపై అక్రమ కేసులు..

by Shyam |
పోలీసుల సాయంతో బీజేపీ నేతలపై అక్రమ కేసులు..
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని చూస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల ఫలితంతో రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయన్నారు. దుబ్బాకలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకొని దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. మంత్రి హరీష్ రావు పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీపీ ప్రవర్తించిన తీరుపై డీజీపీకి, సీఈవోకు ఫిర్యాదు చేశామని చెప్పారు. సిద్దిపేటలో పోలీసుల సోదాల సమయంలో తీసిన వీడియోలను హుమన్ రైట్స్ అధికారులకు అందజేస్తామన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబ్బులు దొరికినా రఘునందన్ రావు కేసీఆర్‌కు చుట్టం కావడంతో ఆ డబ్బులు కూడా రఘునందన్ రావువే అనేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, గుండ్ల జనార్ధన్, పత్రి శ్రీనివాస్ యాదవ్, గోనె మార్కండేయులు, నయిమోద్దీన్, నరసింహారెడ్డి, యాదన్ రావు, తాటికొండ శ్రీనివాస్ కరుణాకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story