విద్యుత్ సౌద కార్యాలయం ముట్టడికి యత్నం.. బీజేపీ నేతలు అరెస్ట్

by Shyam |
విద్యుత్ సౌద కార్యాలయం ముట్టడికి యత్నం.. బీజేపీ నేతలు అరెస్ట్
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ.. సోమవారం విద్యుత్ సౌద కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం నుంచి బయల్దేరి వస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టులను నిరసిస్తూ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మూర్ఖపు విధానాల వల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులతో బీజేపీ పోరాటం ఆగదని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ, అశాస్త్రీయ పద్ధతులతో పేద, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్‌ బిల్లుల రూపంలో భారం మోపుతోందని మండిపడ్డారు. మూడు నెలల పాటు ఆర్థికంగా చికితిపోయిన ప్రజానికానికి ఊరట నివ్వాల్సిన ప్రభుత్వం విద్యుత్ బిల్లుల రూపంలో నెత్తిన భారం మోపిందని మండిపడ్డారు. ప్రజల్ని దోచుకోవాలనే దురుద్దేశంతోనే దోపిడీ విధానాలకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వినియోగదారుల సంఖ్య కోటి 15 లక్షలు మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ వినియోగదారులందరిపై ఇష్టానుసారంగా భారం మోపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పాలన అందించాల్సిన ప్రభుత్వం వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టుగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల తరహాలో వడ్డీతో సహా బిల్లులు వసూలు చేయాలని భావించడం ఏ విధంగా కరెక్ట్‌ అని ప్రశ్నించారు. గడువులోగా బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌ చేస్తామని, ఫైన్‌ వేస్తామని బెదిరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ప్లాన్‌ ప్రకారమే అక్రమ విధానాలతో ప్రజల నుంచి రూ.300 కోట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రజలు సోషల్‌ మీడియా, మీడియా ద్వారా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ ద్వారా సంబంధిత అధికారుల్ని కలిసి విజ్ఞాపనలు అందించినా స్పందించకపోవడం వల్లే ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరిపడా పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఎన్‌-95 మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ప్రజలు, వైద్యులు, పోలీసులు, మీడియా ప్రతినిధులను ప్రభుత్వం కాపాడటం లేదని అన్నారు. కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం నిధుల్ని ప్రజల కోసం ఖర్చు చేయాలన్నారు. కనీసం విద్యుత్‌ బిల్లుల్ని మాఫీ చేసి ప్రజలపై భారం తగ్గించాలన్నారు. కేంద్రం నిధులకు లెక్కలు చెప్పకుండా వివిధ పద్ధతుల్లో ప్రజలపై తిరిగి భారం మోపడం సబబు అని సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అశాస్త్రీయంగా విధించిన బిల్లుల్ని బేషరతుగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story