BJP-Etela Rajender: బీజేపీలో చేరేందుకు ఈటలకు అధిష్టానం కండిషన్..?

by Anukaran |   ( Updated:2021-06-03 09:42:31.0  )
BJP-Etela Rajender: బీజేపీలో చేరేందుకు ఈటలకు అధిష్టానం కండిషన్..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో ఎన్నో మలుపులు… ఎన్నో సుడిగుండాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొన్నటి వరకు రాజేందర్ అడుగులు ఎటు అన్న సంశయం కొనసాగితే.. ఇప్పుడాయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన తరువాత కూడా క్లారిటీ రావడం లేదు. అసలేం జరుగుతోంది.? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తూటాల ఈటల…

ఉద్యమ నేత కేసీఆర్ వెన్నంటి నడిచిన నాయకుల్లో ఒకరైన ఈటల రాజేందర్ ఏప్రిల్ 30 నుండి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఆయన చుట్టూ కేంద్రీకృతమైన రాజకీయాలను పరిశీలిస్తే మాత్రం ఈటల ఖచ్చితంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా మారుతారనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఆయన బీజేపీ అధిష్టానాన్ని కలవడంతో కామ్రేడ్ కాస్తా కాషాయ కండువ కప్పుకోవడం ఖాయమైపోయినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే ఢిల్లీ వెళ్లి కమలనాథులందరితో సమావేశం అయిన ఈటల హైదరాబాద్ చేరుకున్న తరువాత మాత్రం మౌనమే నా భాష అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఢిల్లీ నుండి వచ్చే ముందే తన కేడర్ కు సమాచారం ఇవ్వడంతో హుజురాబాద్ నియోజకవర్గం నుండి కొంతమంది నాయకులు శామీర్‌పేట్ కు వెళ్లారు. అయితే వారందరితో ఈటల చర్చించినప్పటికీ సెకెండ్ కేడర్ కు మాత్రం ఆయన పయనమెటూ అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. కానీ బీజేపీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఆయనకు ఓ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మీరు మాతో కలిసి రాజకీయాల్లో కొనసాగాలంటే మాత్రం పార్టీకి, పదవికి రాజీనామా చేసి రండి. ఆ తరువాతే మేం మిమ్మల్ని పార్టీలో చేర్పించుకుంటాం అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా సమాచారం. దీంతో ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన తరువాత శామీర్‌పేట్ లోని తన నివాసంలో భవిష్యత్తు కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది.

రాజీనామా చేస్తే..?

కాదన్న పార్టీకి రాజీనామా చేసినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా తన భవిష్యత్తు ఏంటీ..? అన్నదే ఈటల ముందు ఉన్న సవాల్. పార్టీ విషయంలో క్లారీటీ ఉన్నప్పటికీ పదవికి రాజీనామా చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందన్నదే తర్జనభర్జనలకు కారణమని ఈటలకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు చెప్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే హుజురాబాద్ లో బలహీనంగా ఉన్న బీజేపీ అభ్యర్థిగా.. తిరిగి తాను చట్ట సభలో అడుగు పెడతానా లేక చతకిలపడతానా అన్న అంతర్మథనం కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది.

నాన్చుడే నాశనం చేసింది…

ఏప్రిల్ 30న ఈటల రాజేందర్ అంశం తెరపైకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయింది. మరునాడే ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు రంజుకెక్కాయి. దీంతో డూ ఆర్ డై అన్నట్టుగా ఈటల తన వ్యూహాలకు పదును పెడ్తారని భావించారంతా. రోజుకో మలుపు తిరుగుతున్న ఈటల వ్యవహారం చివరకు బీజేపీ అధిష్టానాన్ని కలవడం ఆ తరువాత సైలెంట్ గా ఉండడమే అంతుచిక్కకుండా పోయింది. పార్టీ పెడతానన్న సంకేతాలు ఇవ్వడం ఆ తరువాత సైలెంట్ కావడం, వేరే పార్టీలో చేరతారని ప్రచారం జరగడం మళ్లీ సైలెంట్ కావడం, తిరిగి అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లడంతో అంతా కూడా ఈటల మదిలో ఏముంది అన్న చర్చే సాగింది. కానీ ఇప్పటికీ ఆయన మాత్రం నోరు విప్పకుండా వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్న సంకేతాలను పంపిస్తున్నారు. కానీ ఈటల తర్జనభర్జనలు, మానసిక సంఘర్షణల ఫలితంతో ఇప్పటికే ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అయిందనే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్ లు.

బీజేపీ చెప్పినట్టే..

బీజేపీ అధిష్టానం చెప్పినట్టే రాజీనామా చేస్తారా లేక మళ్లీ తన ఆలోచనలతో గజిబిజిగా మారుతారా అన్నదే ప్రజంట్ హాట్ టాపిక్. వాస్తవంగా ఆయన ఇప్పటికే తన వైఖరిని వెల్లడించకుండా నర్మగర్భంగా ఉండడమే తీరని నష్టాన్ని కల్పించింది. ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తే ఆయనకే నష్టం అన్న అభిప్రాయాలనూ వ్యక్తం చేస్తున్నవారు లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed