పదివేల డప్పులతో దద్దరిల్లే ఉద్యమం.. కేసీఆర్‌కు దళితమోర్చా హెచ్చరిక

by Sridhar Babu |
BJP Dalit Morcha
X

దిశ, కరీంనగర్ సిటీ: దళితబంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో ఈసీ దళితబంధు పథకాన్ని నిలిపివేసింది. అయితే, దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఎన్నికల కమిషన్ మూడో తేదీ వరకే ఆపగలదని, నాలుగో తేదీనుంచి అమలు చేసి తీరుతామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాలుగో తేదీ దాటి మూడు రోజులవుతున్నా.. ముఖ్యమంత్రి దళితబంధు అమలుపై ఊసెత్తడం లేదని బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ డప్పుల మోత కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సొమిడి వేణు ప్రసాద్ తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యవర్గ, పదాధికారుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వేణు ప్రసాద్ మాట్లాడుతూ.. దళితబంధు అమలు కోసం ‘డప్పుల దరువు’ అనే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పదివేల డప్పులతో మోత మోగించి, కేసీఆర్‌కు కళ్ళు తెరిపించి, దళితబంధు అమలు చేసే విధంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా నుండి సుమారు 500 మంది డప్పు కళాకారులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, అసత్య హామీలతో అవసరాలు తీర్చుకునే పరిస్థితిని దళిత సమాజం గ్రహించిందన్నారు. హుజురాబాద్‌లో ఎన్నికల అస్త్రంగా దళితబంధు తీసుకొచ్చిన కేసీఆర్ వైఖరిపై అలుపెరగని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దళితబంధు రాష్ట్రమంతా అమలయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధికార ప్రతినిధి బాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, రాజు, ఉపాధ్యక్షులు అభిలాష్, మల్లేశం, పరుశురాం, వేణుగోపాల్, నిఖిల్, ప్రసన్న, ప్రశాంత్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed