కమలాపూర్‌లో ఓటేసిన ఈటల.. సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-10-29 23:12:56.0  )
Etela Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. శనివారం ఉదయం కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని, రూ.వందలకోట్లు పంపిణీ చేశారని ఈటల ఆరోపించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఆయన అభివర్ణించారు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంతం పట్టినట్లున్నారని.. అందుకే అధికారయంత్రాంగం సాయంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారని ఆరోపించారు.

ప్రజలంతా దీన్ని ఎదుర్కోకపోతే సమాజం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని.. ఆత్మగౌరవం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల పిలుపునిచ్చారు. అంతేగాకుండా.. ‘‘సాదుకున్నా మీరే, చంపుకున్నా మీరే. మీ ప్రేమ, అభిమానం ముందు డబ్బులు, మద్యం పనిచేయవు. పోలింగ్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే మంచికి సంకేతం. ఈ రోజు వారి ఆత్మను ఆవిష్కరించి, గుండెళ్ళో గూడుకట్టుకున్న అభిమానాన్ని, ప్రేమని ఆవిష్కరిస్తున్నారు. 90 శాతం పోలింగ్ అవుతుంది అని అనుకుంటున్నాను.’’ అని ఈటల రాజేందర్ అన్నారు.

Advertisement

Next Story