‘కొవాగ్జిన్’ మూడో డోసు ట్రయల్స్‌కు అనుమతి

by vinod kumar |
‘కొవాగ్జిన్’ మూడో డోసు ట్రయల్స్‌కు అనుమతి
X

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా మూడో డోసు ట్రయల్స్‌కు రెగ్యులేటరీ నిపుణుల కమిటీ అనుమతినిచ్చింది. రెండో దశ ట్రయల్స్‌లో రెండు డోసులూ తీసుకున్న వాలంటీర్లపై మూడో డోసు ట్రయల్స్‌ చేసుకోవాలని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కొవాగ్జిన్ టీకాను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు డోసుల ఈ టీకాకు అదనంగా మూడో డోసునూ చేర్చాలని సంస్థ భావిస్తు్న్నది. అదనపు బూస్టర్ డోసు కరోనాను నిలువరించే టీకా సామర్థ్యాన్ని కొన్నేళ్ల వరకు చెక్కుచెదరకుండా నిలిపి ఉంచాలనే లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లలో కొవాగ్జిన్ రెండో దశ ట్రయల్స్ సాగాయి. ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న వారికి, ఇప్పుడు అంటే ఆరు నెలల తర్వాత అదనపు బూస్టర్ డోసును ప్రయోగించి సంస్థ పరిశీలించనుంది. ఆ పార్టిసిపెంట్లను మరో ఆరు నెలలపాటు పరిశీలించాల్సి ఉంటుందని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఎస్ఈసీ) సమావేశపు వివరాలలో పేర్కొంది. ఈ ట్రయల్స్ ప్రథమ, ద్వితీయ లక్ష్యాలను, సవరించిన క్లినికల్ ట్రయల్ ప్రొటోకాల్‌లనూ సమీక్ష కోసం సమర్పించాల్సిందిగా సూచించింది.

ఫేస్ 2 ట్రయల్స్‌లో సుమారు 190 పార్టిసిపెంట్లు ఈ కొవాగ్జిన్ షాట్లు తీసుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టి, ఒక గ్రూపులోని సభ్యులకు బూస్టర్ డోసును అందిస్తారని తెలిసింది. అదనపు డోసు ద్వారా ఈ టీకా ఎంత కాలం కరోనా నుంచి రక్షణ ఇవ్వగలుగుతున్నదని పరిశీలించనున్నారు. మూడో డోసు ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా టీ సెల్స్ మెమరీని పటిష్టం చేయగలుగుతుందా? లేదా? అనే విషయాన్ని తేల్చనున్నారు.

కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీకాలు అనుమతి పొందాయి. అలాగే, మరెన్నో అభివృద్ధి దశలో ఉన్నాయి. కానీ, ఈ టీకాలు ఎంతకాలంపాటు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయన్న సంశయం మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నది. అందుకే కొన్ని ఫార్మా సంస్థలు ఏడాదికొకసారి బూస్టర్ షాట్ ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇదే దారిలో భారత్ బయోటెక్ ముందడుగేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం భారత్ బయోటెక్ దేశంలో సుమారు 25,800 మంది వాలంటీర్లతో థర్డ్ ఫేస్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. టీకా మధ్యంతర సామర్థ్యం 80.6శాతంగా ఉన్నట్టు మార్చిలో ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed