భద్రాద్రి ఆలయం.. అక్రమాల మయం

by Sridhar Babu |
Bhadradri temple
X

భద్రాద్రి.. దక్షిణాపథాన అయోధ్యాపురిగా వెలుగొందుతున్న పుణ్యస్థలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఏళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోలేదనే విమర్శలు ఒకవైపు.. నవమి ఉత్సవాల్లో రామ నామాన్ని తప్పుగా చెబుతున్నారంటూ పీఠాధిపతులు, భక్తుల ఆందోళనలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు.. మరో వైపు చూస్తే సందట్లో సడేమియా.. నేనే బడేమియా అన్న చందంగా రాములోరి ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. భద్రగిరి క్షేత్రం అనేక స్కాములకు నిలయంగా మారుతున్నది. అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి ఆలయం అవినీతికి నిలయంగా మారింది. రోజుకో స్కాం బయటపడుతుండటంతో భక్తలు నోరెళ్లబెడుతున్నారు. పలువురు ఉద్యోగులు, అధికారులు స్వామివారి ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. కరోనా సంక్షోభం ఆలయాలనూ కుదిపేసింది. ఆ సమయంలో ఆలయంలో పనిచేసే దాదాపు 30 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్.. కొంతమంది ఆలయ ఉద్యోగులతో కుమ్మక్కై తొలగించిన సిబ్బంది జీతాలను సైతం కాజేశారని తెలుస్తున్నది. దాదాపు పదినెలల పాటు పదుల సంఖ్యలో సిబ్బంది జీతాన్ని తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పలు కారణాలతో మానేసిన ఉద్యోగులు.. హాజరవుతున్నట్టు చూపించి ఓ అధికారి కొన్ని నెలలుగా జీతాలు డ్రా చేస్తున్నట్టు సమాచారం. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సెలవు కాలాన్ని కూడా హాజరైనట్లు చూపిస్తూ డబ్బులు డ్రా చేస్తున్నారని తెలుస్తున్నది.

ఎలా బయటకొచ్చిందంటే..

ఇంజినీరింగ్ విభాగంలో పని చేసే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కొంత కాలంగా విధులకు హాజరుకావడం లేదు. ఆ ఉద్యోగి జీతం నెలకు రూ. 21 వేల చొప్పున, కొందరు సిబ్బందితో కుమ్మక్కై డ్రా చేస్తూ వస్తున్నారు.. పరిపాలనా విభాగంలో కూడా ఓ మహిళా ఉద్యోగి దాదాపు 10 నెలల నుంచి హాజరుకావడం లేదు. ఆమె పేరు మీద రూ. వేలల్లో జీతం డ్రా చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి చెక్కులకు చెల్లింపు సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. రానివారి పేరుమీద చెక్కులు తీసుకుంటుండటంతో సహోద్యోగులకు అనుమానం వచ్చింది. విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలిసిపోయింది.

తీసుకున్న సొమ్ము తిరిగిస్తారట

ఈ అవినీతి బాగోతంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన కాంట్రాక్టర్ తో పాటు ఆలయంలో పనిచేసే ఈవో తర్వాతి క్యాడర్లో ఉన్న వ్యక్తి.. ఆయనతో పాటు ఈవో సీసీ, జూనియర్ అసిస్టెంట్ ఈ దందాలో భాగస్వాములని సమాచారం. విషయం బయటకు రావడంతో ఇప్పటి వరకు తీసుకున్న జీతాలను కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈవోను మేనేజ్ చేసినట్టు బాహాటంగానే ప్రచారం జరుగుతున్నది.

ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు కూడా..

అంతేకాదు.. ఆలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు కూడా ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమోదంలేని యూనివర్సిటీలనుంచి కొనుక్కున్న సర్టిఫికెట్లతో కొంతమందికి పదోన్నతులు ఇప్పించి వారి నుంచి ముడుపులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ, ధర్మదాయశాఖలో కీలక స్థానంలో పనిచేసే ఉన్నతోద్యోగుల వద్ద తమ పలుకుబడి ఉపయోగించి కొందరు ఆలయంలో పలు అక్రమాలకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా దేవాదాయశాఖకు సంబంధించి సమాచారం బయటకు ఇవ్వకూడదనే నిబంధనను కూడా కొంతమంది అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.

ఉత్సవాల లెక్కలేవీ..?

ప్రతి ఏడూ భద్రాద్రి రామాయంలో జరిగే ఉత్సవాల లెక్కల్లోనూ అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ లెక్కల్లో తేడా వచ్చిన సందర్భాలున్నాయి. ఆలయంలో ముక్కోటి, నవమి ఉత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి.. అయితే గతేడాది కరోనా నేపథ్యంలో నవమి ఉత్సవాలు నిరాడంబరంగా కేవలం ఆలయ వేదపండితులు, అత్యంత ప్రముఖుల సమక్షంలోనే జరిగాయి. వాటికి భక్తులెవరూ హాజరు కాకపోవడంతో ముత్యాల తలంబ్రాలు భారీగా మిగిలిపోయాయి. వాటిని దేవస్థానానికి అప్పగించకుండా.. ఖర్చు అయినట్టు చూపించి అవే ఈ ఏడాది ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు మళ్లీ కొత్తబిల్లులు పెట్టి పాత తలంబ్రాలనే ఉపగించనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ముక్కోటి ఉత్సవాలకు సంబంధించి అలంకరణ సామగ్రిపై అధికంగా బిల్లులు పెట్టి కొంత మంది ఉద్యోగులు, సిబ్బంది కలిసి దేవుని సొమ్ము రూ. లక్షల్లో స్వాహా చేసినట్టు ఆరోపణలున్నాయి.

విదేశీ కరెన్సీ హాంఫట్..

భద్రాద్రి రామాలయానికి రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా విదేశాలనుంచి.. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు సైతం స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే భక్తులు స్వామివారికి భారీగానే కట్నకానుకలు సమర్పిస్తారు. కొంతమంది విదేశీ కరెన్సీకూడా హుండీల్లో వేస్తారు. రాములోరి హుండీ ఆదాయం లక్షల్లో ఉండడం వల్ల సిబ్బంది అనేక నియమాల నడుమ లెక్కింపు కార్యక్రమం చేపడతారు. అంతా సరిగా ఉన్నా.. భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ లెక్కలు మాత్రం సరిగా ఉండవని ఆలయ సిబ్బందే ప్రచారం చేస్తున్నారు. డాలర్లతో పాటు పలు దేశాల కరెన్సీని కూడా కొంతమంది కుమ్మక్కై దొడ్డిదారిన బయటకు పంపుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇక ఆలయాల్లో పలు పనులు, వస్తువుల తయారీకి సంబంధించి ఇష్టారీతిన డబ్బు అడ్వాన్స్ గా ఇస్తున్నారని.. వాటికీ సరైన లెక్కలు చూపించడం లేదనే విమర్శలున్నాయి. కల్యాణాలు టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా గతంలో ఆలయ సిబ్బంది పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

అతిత్వరలో ఆలయంలో అంతర్గత బదిలీలు.?

ఇంతకాలంలో రామాలయంలో జరిగే పలు అక్రమాలు బయటకు రావడం.. అవ్వన్నీ నిజమే అని తేలిపోవడంతో ఆలయ ఈవో అంతర్గతంగా వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన వారికి నేడేరేపో అంతర్గత బదిలీల కూడా జరగనున్నట్టు సమాచారం. రామాయలంలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పరిణామాలపై రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిని ఆలోచించకుండా. పలు అక్రమాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story