ధోని ఫేర్‌వెల్ కోసం బీసీసీఐ ఏర్పాట్లు?

by Shiva |
ధోని ఫేర్‌వెల్ కోసం బీసీసీఐ ఏర్పాట్లు?
X

దిశ, స్పోర్ట్స్ : స్వాతంత్ర దినోత్సవం రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. యూఏఈలో జరగనున్న ఐపీఎల్ (IPL) సమయంలో ధోనితో బోర్డు ఈ విషయమై చర్చించనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ప్రస్తుతం టీం ఇండియా ఆడబోయే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లే ఏవీ లేవు. కాబట్టి ఐపీఎల్ అనంతరం ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఏర్పాటు చేసి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని బోర్డు భావిస్తున్నది.

ఈ విషయంపై బోర్డు ఇంత వరకు ధోనితో సంప్రదించలేదు. కానీ అతను ఒక మ్యాచ్ లేదా ఒక సిరీస్ ఆడేందుకు సుముఖంగా ఉన్నాడో లేదో కనుక్కొని.. అతడి నిర్ణయం ప్రకారమే ఏర్పాట్లు చేస్తారని ఆ అధికారి స్పష్టం చేశాడు. ధోని కోసం ఒక వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిన నిర్ణయం అని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఒక లెజెండరీ ఆటగాడి కోసం బీసీసీఐ మ్యాచ్ ఏర్పాటు చేయడం సంతోషించదగినది.. అతడు ఇండియన్ క్రికెట్ కోసం ఎంతో చేశాడు అని లాల్ అన్నారు.

యూఏఈలో ఐపీఎల్ ఏర్పాటు చేయడం వల్ల అతడిని టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసే వీలుంది. అయితే ఇండియాలోనే ధోని వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేస్తే.. అభిమానులు అతడిని ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ అలాంటి ఆలోచనలో ఉంటే మాత్రం ఆ ఫేర్‌వెల్ మ్యాచ్ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అభిప్రాయపడ్డారు.

ఈ మ్యాచ్‌ను మేం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఫేర్‌వెల్ మ్యాచ్‌కు ధోని అంగీకరించే అవకాశం లేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ధోనికి వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేస్తే.. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌ల రిటైర్మెంట్ వ్యవహారం కూడా ప్రస్తావనకు వస్తుందని, వాళ్లు కూడా సాదాసీదాగానే ఆటకు గుడ్ చెప్పారనే వాదన వస్తుందంటున్నారు. ఈ క్రమంలోనే ధోని ఫేర్‌వెల్ మ్యాచ్‌కు ఒప్పుకోడని అభిప్రాయపడుతున్నారు. మరి ధోని మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు.

Advertisement

Next Story

Most Viewed