'షట్‌డౌన్' : 4రోజుల పాటు నిలిచిపోనున్న ప్రభుత్వ బ్యాంకింగ్ సేవలు

by Anukaran |   ( Updated:2021-03-12 21:28:01.0  )
షట్‌డౌన్ : 4రోజుల పాటు నిలిచిపోనున్న ప్రభుత్వ బ్యాంకింగ్ సేవలు
X

దిశ,వెబ్‌డెస్క్: నేటినుంచి నాలుగు రోజుల పాటు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. నేడు రేపు బ్యాంక్ ల సాధారణ సెలవులతో పాటూ ఈ నెల 15,16 వ తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. గతంలో పలు ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై బ్యాంక్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.

ప్రైవేటీకరణపై సీతారామన్ ప్రకటన

ఈఏడాది ఫిబ్రవరి 1న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రెండు ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నిర్మలా సీతారామన్ ప్రకటించిన రెండు బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడమే కాకుండా మరో రెండు బ్యాంకుల్ని ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రైవేటీకరణ చేసే ప్రక్రియ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15,16న దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టేందుకు ప్రభుత్వ బ్యాంకింగ్ యూనియన్లు నిర్ణయించారు.

ఆ నాలుగు బ్యాంకులు ఇవేనా

కేంద్రం రెండు బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసి, మరో రెండు బ్యాంకుల్ని ప్రైవేట్ యాజమాన్యాలకు దారాదత్తం చేసేందుకు సిద్ధమైన బ్యాంకుల్లో ఈ నాలుగు బ్యాంకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రలు ఉన్నట్లు సమాచారం. ఇక కేంద్రం నిర్ణయం కొనసాగితే సుమారు 1లక్షా 22వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారు 50 వేలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33 వేలు, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మ‌హా రాష్ట్రలో 13 వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.

Advertisement

Next Story