కేసీఆర్, కేటీఆర్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్న !

by Shyam |   ( Updated:2020-05-25 08:24:11.0  )
కేసీఆర్, కేటీఆర్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్న !
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ నివారణ చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు, మంత్రి కేటీఆర్‌కు అందిన విరాళాల మొత్తం ఎంత? వాటిని ఎలా ఖర్చు పెట్టారు, ప్రజలకు స్పష్టంగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వలస కార్మికుల తరలింపు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టారని చెబుతున్న నిధులు కేంద్రం ఇచ్చిన విపత్తు నిధికి సంబంధించినవా.. లేక వేరే నిధులా.. అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వానికి వచ్చిన నిధులు, ఖర్చు వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దూరదృష్టితో ఆలోచించి కేంద్రం ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీని ప్రకటిస్తే, కేసీఆర్ తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవటానికి మాటల గారడీతో కేంద్రంపై అర్థరహిత విమర్శలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ఉద్దీపనలు ఫ్యూడల్‌ విధానంలో ఉన్నాయని కేసీఆర్ అనడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాల చేతులకు నేరుగా నగదు ఇస్తే జేబులు నింపుకునే ధోరణి పెరిగేదని, ఆ పద్ధతి ఇక సాధ్యంకాదన్నారు. రైతుబంధు ఆర్థిక సహాయాన్ని, పంటల నియంత్రిత పద్ధతితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి కరోనా నిధులను ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఎన్‌డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన రూ. 224 కోట్లు, మెడికల్ పరికరాల కోసం ఇచ్చిన రూ.216 కోట్లు, డివల్యూషన్ నిధుల్లో తొలి విడతగా ఇచ్చిన రూ.982 కోట్లను ఎలా ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed