బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా?: బండి సంజయ్

by Shyam |
బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా?: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బైబిల్ పార్టీ కావాలో లేక భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాల్సింది ఆ నియోజకవర్గ ప్రజలేనని, కానీ తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలే అక్కడ రిపీట్ కాక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంద్రప్రదేశ్‌లో ఒక మతం రాజ్యమేలుతోందని, అందుకు తిరుమల ఏడు కొండలను రెండు కొండలు అని చెప్తోందని, కానీ బీజేపీ మాత్రం ముమ్మాటికీ అది ఏడు కొండలేనని ప్రగాఢంగా నమ్ముతోందన్నారు. దైవ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు మూర్ఖులని వ్యాఖ్యానించిన బండి సంజయ్ వైఎస్సార్సీపీ తిరుపతి నుంచి మూట ముల్లె సర్దుకుని వెళ్ళిపోక తప్పదన్నారు.

ఏపీలో హిందు దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, దేవాదాయ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. హిందువుల కానుకలను, హిందు దేవాలయాల్లో భక్తుల విరాళంగా ఇచ్చిన డబ్బు ఇతర అవసరాలకు దారి మళ్ళుతోందని ఆరోపించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో హిందువులపైనా, హిందు దేవాలయాలమైన జరుగుతున్న దాడులను బీజేపీ సహనంతో భరిస్తోందని, కానీ దీన్ని చేతకానితనంగా భావిస్తే అది పొరపాటేనని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ఏపీ సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

కేసీఆర్‌ను నిద్రపోనివ్వం : మురళీధర్‌రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పులన్నింటినీ ప్రజల్లో బహిర్గతం చేస్తామని, ఆయనను అగ్నిమీద నిలబెడతామని, ప్రజలను కదిలించి ఉద్యమాలు చేస్తామని, ఆయనను ప్రశాంతంగా నిద్రపోనివ్వమని బీజేపీ నేత మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే మరింత అధ్వాన్నమయ్యాయమని, రాష్ట్రానికి, ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయమే చేసిందన్నారు. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఒక్కొక్క రోజు గడుస్తున్నా కొద్దీ తెలంగాణకు మరింత నష్టం, అన్యాయం తప్పవని, రాజకీయ సంక్షోభం తప్పదన్నారు.

బీజేపీలో చేరిన దరువు ఎల్లన్న
ఉస్మానియా వర్శిటీ విద్యార్థి జేఏసీ నాయకుడు, గాయకుడు దరువు ఎల్లన్న సోమవారం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీళ్ళు, నిధులు, కొలువుల పేరుతో కొట్లాడామని, కానీ చివరకు కేసీఆర్ చేతిలో రాష్ట్రం బందీ అయిందని దరువు ఎల్లన్న వ్యాఖ్యానించారు. కొట్లాటే ఊపిరిగా బతుకుతున్న దరువు ఎల్లన్న అలాంటి కొట్లాడే పార్టీతో ఉండాలన్న డిమాండ్ రావడంతో ఏడాది పాటు మదనపడి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. గడీల పాలన అంతం కోసమే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. ఇకపైన కేసీఆర్‌ను గద్దె దించే సైన్యంలో ఒక సామాన్య సైనికుడిగా పోరాడుతానని, కోవర్టులతో ఉండేకంటే కొట్లాడే పార్టీతో ఉండాలన్న ఉద్దేశంతోనే చేరానని తెలిపారు. ఉద్యమకారులంతా అమరవీరుల ఆశయాల సాధన కోసం బీజేపీకి మద్దతు పలకాలని కోరారు.

వరంగల్‌కు బండి సంజయ్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయడం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నగరంలో పర్యటించనున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో అక్కడ కూడా జీహెచ్ఎంసీ తరహా గెలుపు కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఏ పార్టీ కన్నా ముందుగానే అక్కడ కార్యాచరణను మొదలుపెట్టిన బీజేపీ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటికే జితేందర్ రెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించింది. మరోవైపు జీహెచ్ఎంసీలో బీజేపీ కార్పొరేటర్లతో పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశం నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed