బండి.. తన రూటే సపరేటు !

by Shyam |
బండి.. తన రూటే సపరేటు !
X

గన్‌మెన్లు లేకుండా ప్రజల్లోకి

దిశ, కరీంనగర్ :

భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్.. ఓ జాతీయ పార్టీకి ఎంపీ.. అంతేనా ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా. అయితేనేం రెండు నెలలుగా గన్‌మెన్లు లేకుండానే ప్రజల్లో తిరుగుతూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఈ డేరింగ్ లీడర్ ఎవరో.. ఈ పాటికే అర్థమై ఉంటుంది. అవును ! ఆయనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తనకు గన్‌మెన్లే వద్దని ప్రభుత్వానికి లేఖ రాసి మరీ వారిని తిప్పి పంపారు. పోలీసులకు ఆయనకు మధ్య జరిగిన వివాదమే గన్‌మెన్లను తిరస్కరించేందుకు కారణమైంది. ఇక అప్పటి నుంచి బండి సంజయ్ రక్షణ వలయం లేకుండానే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు.

జనవరిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, బండి సంజయ్ రాళ్ల దాడికి గురయ్యారని ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం సంజయ్ పై రాళ్ల దాడి జరగలేదని, అవి పుకార్లేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో సంజయ్.. దాడులే జరగనప్పుడు తన కోసం ప్రత్యేకంగా బాంబ్ డిఫ్యూజ్ పార్టీలను ఎందుకు తిప్పారని ప్రశ్నించారు. పోలీసులు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఎంపీపై పోలీసు అధికారులు ఆరోపణలు చేయడం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. ఆ తరువాత గన్‌మెన్లు అవసరం లేదని తిప్పి పంపారు. మునిసిపల్ ఎన్నికలకు ముందు తన కార్యకర్తల బైక్ లపై తిరుగుతూ ప్రచారం చేశారు. పోలీసులు సంజయ్ కోసం ఆరా తీసినా ఆయన ఆచూకీ దొరక్కపోగా, ఆయన ఇంటికి వచ్చిన గన్‌మెన్లను తనతో పాటు తీసుకెళ్లకుండానే నగరం అంతా తిరిగారు. చివరకు తనకు కేటాయించిన గన్‌మెన్లను విరమించుకోవాలని డీజీపీకి లేఖ రాసి, అప్పటి నుంచి సింగిల్ గానే తిరుగుతున్నారు.

హిందుత్వ నినాదమే తన ఆయుధమని చెప్పే బండి సంజయ్.. గతంలో టార్గెట్ అయిన సంఘటనలూ లేకపోలేదు. పదేళ్ల కిందటే సంజయ్‌కు హాని ఉందంటూ లేఖలు వెలువడటంతో ఆయన ఇంటి వద్ద ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశారు. తరువాత సంజయ్‌ను టెర్రరిస్టులు టార్గెట్ చేశారంటూ వెలువడ్డ లేఖలు కలకలం లేపాయి. దీంతో పోలీసులు సంజయ్‌పై ప్రత్యేక నజర్ వేసి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సంజయ్ ఇంటి వద్ద రాళ్ల దాడి జరిగింది. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా నియమించబడ్డ బండి సంజయ్‌కు ప్రభుత్వం మాత్రం గన్‌మెన్లను కేటాయించలేదు. దీంతో సంజయ్ ఇప్పటికీ గన్‌మెన్లు లేకుండానే తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

కేరళలో నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలు కరీంనగర్‌లో కొనసాగుతున్నాయని తేలింది. కరీంనగర్‌లో ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకునికి పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల పోలీసుల దాడుల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ రక్షణ వలయం లేకుండా పర్యటించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంజయ్ కరీంనగర్‌లో పర్యటించినప్పుడు పోలీసు అధికారులు అతనికి షాడో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారే తప్ప గన్‌మెన్లను మాత్రం కేటాయించడం లేదు. అయితే బండి సంజయ్ విషయంలో మాత్రం అధికారులు గన్‌మెన్లను తీసుకోవాలన్న ప్రతిపాదనలు కూడా చేయడం లేదని తెలుస్తోంది.

Tags: Bandi Sanjay, KNR MP, BJP, No Security, issue with Police

Advertisement

Next Story

Most Viewed