‘బంధం కుంట’లో సెల్‌ టవర్..? ‘మనీ’ ఇంపార్టెంట్ అంటున్న అధికారులు

by Anukaran |
‘బంధం కుంట’లో సెల్‌ టవర్..? ‘మనీ’ ఇంపార్టెంట్ అంటున్న అధికారులు
X

దిశ, శామీర్ పేట్ : పట్టణాలకు గ్రామాలే పట్టుకొమ్మలని చెబుతూ చిన్న చిన్న గ్రామాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు సజావుగా పరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుండగా.. అభివృద్ధి చెందుతున్న గ్రామాలు, ప్రజా సంక్షేమం రెండు కన్నులుగా పరిపాలన విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఇందులో భాగమైన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు పారదర్శకంగా పాలన అందించకుండా దొరికినకాడికి దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తంతు శామీర్‌పేట్ మండలం మురహరిపల్లిలో వెలుగుచూసింది. ప్రజా సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి పాటుపడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా ధనాన్ని దోచుకునే పనిలో బిజీ అయ్యారు.

అసలు విషయానికొస్తే.. మురహరి పల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 31,32లో గల ‘బంధం కుంట’ను కొందరు అక్రమార్కులు మట్టితో పూడ్చేశారు. పట్టా స్థలంలో ఈ కుంట ఉన్నప్పటికీ దీనిని వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించాలి నిబంధన ఉంది. అయినా, సదరు ప్రజాప్రతినిధి వాణిజ్య సదుపాయాల్లో భాగమైన సెల్‌టవర్ ఏర్పాటు చేసి ప్రతీనెలా డబ్బులు దండుకుంటున్నారు.

అలుగును మట్టితో పూడ్చివేయడంతో..

అలుగును మట్టితో పూడ్చివేయడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంట కట్ట తెగి ఆ వరద నీరంతా సమీపంలోని ప్రజయ్ హోమ్స్ కాలనీలోని ఇండ్లలోకి చేరింది. ఫలితంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కుంటలో టవర్..

మురహరి పల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 31,32 లోని పట్టా స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజాప్రతినిధి సెల్ టవర్‌ను ఏర్పాటు చేసి డబ్బులు దండుకుంటున్నాడు. అక్రమాలను అరికట్టాల్సిన ఇరిగేషన్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని గ్రామస్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చొరవ చూపి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed