బాలాకోట్ ‘ఆపరేషన్’‌కు ఏడాది!

by Shamantha N |
బాలాకోట్ ‘ఆపరేషన్’‌కు ఏడాది!
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన బాలాకోట్ మెరుపు దాడులకు ఏడాది నిండింది. 2019 ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారుజామున భారతీయ వైమానిక దళం.. సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను మట్టికరిపించాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఖైబర్ పఖ్తుంఖ్వా పరిధిలోని బాలాకోట్‌లో ఉన్న జైషే ముహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నేలకూల్చాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్టు గణాంకాలు పత్రికల పతాక శీర్షికలకెక్కాయి.

ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతికార చర్యగా ఈ ఆపరేషన్ జరిగింది. పుల్వామా ఘటనలో సుమారు 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశమంతా ఉలిక్కిపడింది. అందరిలోనూ భావోద్వేగాలు రగిలాయి. ఈ దాడి అనంతరం 12 రోజులకు బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ జరిగింది.

బాలాకోట్ మెరుపుదాడుల తర్వాతి రోజే పాక్ వైమానిక దళం.. భారత పరిధిలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. పాక్ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ సరిహద్దు దాటాడు. పాక్ పరిధిలో విమానం కూలి అక్కడే పట్టుబడ్డాడు. తర్వాతి రోజే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు అప్పగిస్తామని పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రకటించాడు. మార్చి 1న వాగా సరిహద్దులో కమాండర్ అభినందన్‌ను అధికారులు రిసీవ్ చేసుకున్నారు.

కాగా, బాలాకోట్ ఆపరేషన్‌లో ఎవ్వరూ చనిపోలేరని, అసలు బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలే లేవని పాకిస్తాన్ వాదించింది. అంతర్జాతీయ మీడియాను ఆ ప్రదేశాన్ని సందర్శించేందుకు అనుమతిచ్చింది. భారత మీడియాలో ప్రచురితమైన కథనాలకు భిన్నంగా అంతర్జాతీయ మీడియా ఈ ఆపరేషన్ గురించి రాసుకొచ్చాయి. భారత బాంబులు చెట్టులు, గుట్టలపై పడ్డాయనీ, చిన్నపాటి నష్ట వాటిల్లింది కానీ, భారత్ పేర్కొంటున్నట్టు 300 మంది చనిపోలేదని ప్రచురించాయి. కాగా, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్‌కు పూర్వం జరిగిన పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, సర్కారు నిర్లక్ష్యంపై అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే, ఈ దాడిని ఎన్నికల్లో మైలేజీగా బీజేపీ వాడుకుందని కొన్ని విశ్లేషణలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed