T TDP తర్వాతి అధ్యక్షుడిగా ‘బక్కని’కి చాన్స్..?

by Shyam |   ( Updated:2021-07-17 06:05:49.0  )
bakkani narsimhulu
X

దిశప్రతినిధి, రంగారెడ్డి : తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక త్వరలో ఉంటుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీ-టీడీపీ అధ్యక్షుడి ఎంపిక బాధ్యత చంద్రబాబుదేనని క్రీయాశీల నేతలు అంటున్నారు. ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో వారం రోజుల క్రితం టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు, అనుబంధ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు.

త్వరలోనే నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటు చేసి నాయకులను తయారు చేసిన చరిత్ర టీడీపీదని ఈ నేపథ్యంలో పార్టీకి నమ్మదగిన వ్యక్తిగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు, జాతీయ కార్యదర్శి బక్కని నర్సింహులు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటుగా నరసింహులు ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. ఆయన ఎప్పుడు పార్టీలు మారలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణకు నమ్మదగిన నమ్మిన బంటు కావాలన్న ఉద్దేశ్యం చంద్రబాబు నాయుడు మదిలో ఉన్నట్టు కార్యకర్తలు పేర్కొంటున్నారు.

షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు ఒక చరిత్ర ఉంది. 2007 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో అప్పట్లో 4 మండలాలు కలవు. (ప్రస్తుతం ఆరు మండలాలు) పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుడ్ నుంచి తిరిగి జనరల్‌కు మారింది. ప్రారంభంలో జనరల్ విభాగములో ఉన్న ఈ నియోజకవర్గము 1967లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎస్సీలకు కేటాయించబడింది. 1967 నుండి 2007 వరకు ఎస్సీలకు రిజర్వుడ్ నియోజకవర్గముగా ఉండేది. గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న బాలానగర్, నవాబుపేట మండలంలోని గ్రామాలు పునర్వ్యవస్థీకరణ ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలో కలిశాయి. మంత్రిగా పనిచేసిన పి.శంకరరావు ఇక్కడి నుంచి 4 సార్లు విజయం సాధించారు. 1952లో తొలి ఎన్నికలలో విజయం సాధించిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరుగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2 సార్లు తెలుగుదేశం పార్టీ, 2 సార్లు తెరాస విజయం సాధించింది.

1994లో బక్కని నర్సింహులు భారీ మెజార్టీతో మాజీ మంత్రి శంకర్ రావుపై గెలుపొందారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన బక్కని నర్సింహులు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి పార్టీకి నమ్మదగిన వ్యక్తిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో బక్కని నర్సింహులు పేరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story

Most Viewed