బద్వేలు ఉపఎన్నికలో ఉద్రిక్తత.. దొంగఓట్ల కలకలం?

by srinivas |   ( Updated:2021-10-30 02:21:20.0  )
Badvel by-election
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన వందల మందిని స్థానికులు అడ్డుకున్నారు. వీరంతా తమ ప్రాంతానికి చెందిన వారు కాదని వారు ఆరోపించారు. ఓటు వేయకుండా స్థానికులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరువర్గాలు చెప్పులతో దాడి చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. సిద్దవటం మండలం నుంచి ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంకటాపురం పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అక్కడికి వివిధ రాజకీయ పార్టీల నేతలు తరలివచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దొంగ ఓటర్లపై కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే కొందరు పోలీసులు, ఇతర అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారంటూ బీజేపీ ఆరోపించగా.. టీడీపీకి చెందిన కార్యకర్తలు పోలింగ్ బూత్‌లలో బీజేపీ అభ్యర్థికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఆరోపించింది.

ఇరువర్గాల మధ్య తోపులాట, పరస్పరం చెప్పులతో దాడి

ఎస్ఐపై చర్యలు తీసుకోండి :

వైసీపీ శ్రేణులకు పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ 149, 150 పోలింగ్ బూతుల వద్ద వైసీపీ పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ ఆరోపించారు. అలాగే దొంగ ఓట్ల పర్వం కూడా జరుగుతుందని ధ్వజమెత్తారు. బయటి ప్రాంతానికి చెందిన వందలాది మంది శుక్రవారం రాత్రి బద్వేలు నియోజకవర్గానికి చేరుకున్నారని ఆరోపించారు. పోలీసుల తీరు చూస్తుంటే వారే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తున్నట్టు ఉందని మండిపడ్డారు. – బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

దొంగ ఓట్లతో గెలిచేది ఓ గెలుపేనా :

తిరుప‌తి ఉప ఎన్నిక స‌మ‌యంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే బ‌ద్వేలులోనూ క‌న‌ప‌డుతున్నాయ‌ని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. బద్వేలులో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదు. వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వైసీపీకి పోలీసులు సహకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలి. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా? అని ప్రశ్నించారు. నాడు తిరుపతి ఉప ఎన్నికలో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో దాన్నే బద్వేలులో పునరావృతం చేస్తున్నారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటు. గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారు? అని విష్ణువ‌ర్ధన్ రెడ్డి ట్విటర్ వేదికగా ఆరోప‌ణ‌లు గుప్పించారు. – బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

వైసీపీ గెలుపు ఖాయం

ఎన్ని ఎత్తులు వేసినా బద్వేలులో వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పలు బూత్‌లలో బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూర్చున్నారని ఆరోపించారు. సిట్టింగ్ అభ్యర్థి మరణించినట్టైతే వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న పక్షంలో పోటీ పెట్టం అన్న టీడీపీ ప్రకటన పచ్చి అబద్ధం అని ధ్వజమెత్తారు. సిట్టింగ్ దళిత శాసనసభ్యుడి పట్ల గౌరవం చూపుతున్నామన్న చంద్రబాబు ప్రకటన కూడా పచ్చి మోసమని విమర్శించారు. దళితుల పట్ల బాబు కపట ప్రేమ మరోసారి స్పష్టమైందన్నారు.

Advertisement

Next Story