- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెరువు మత్తడి తగ్గించడం వల్లనే కబ్జాలు !

దిశ, మాచారెడ్డి : మాచారెడ్డి ఊర చెరువు శిఖం భూమి కబ్జాకు గురికావడానికి ప్రధాన కారణం చెరువు మత్తడి ఎత్తును తగ్గించడమేననే వాదన తెరపైకి వచ్చింది. మిషన్ కాకతీయ రెండో విడతలో 62 లక్షల రూపాయల వ్యయంతో మాచారెడ్డి ఊర చెరువును అభివృద్ధి చేశారు. అందులో భాగంగా చెరువు కట్టను బలోపేతం చేయడం, తూములు, వలుగు పునర్నిర్మాణం చేశారు. మిషన్ కాకతీయ పనులు ముగిసిన సంవత్సరం చెరువు నిండడంతో గతంలో కన్నా తక్కువ విస్తీర్ణంలో నీళ్లు ఆగినట్లు గ్రామస్తులు గమనించారు. సదరు కాంట్రాక్టర్ దృష్టికి సైతం గ్రామస్తులు చెరువు మత్తడి ఎత్తు తగ్గిన విషయాన్ని తీసుకువచ్చారు.
కానీ నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన లెవెల్స్ ప్రకారమే తాను మత్తడి నిర్మాణం చేసినట్లుగా గ్రామస్తులకు కాంట్రాక్టర్ అప్పట్లో వివరణ ఇచ్చినట్లు ప్రస్తుత చర్చలో విషయం బయటకు వచ్చింది. చెరువు నుండి వలుగు పారిన సమయంలో గంగమ్మ గుడి బేస్మెంట్ మునిగిపోయేదని, మిషన్ కాకతీయలో పునర్నిర్మాణం జరిగినప్పటి నుంచి గంగమ్మ గుడి వద్దకు నీరు రావడం లేదని గ్రామస్తులు అప్పుడే గమనించారు. కానీ అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఎఫ్టీఎల్ పరిధిలోని భూమి ఆక్రమనకు గురైనట్టుగా నిర్ధారిస్తున్నారు. పాత మత్తడి ఉన్న సమయంలో చెరువు అలుగు పారేటప్పుడు ప్రస్తుతం గజ్యా నాయక్ తండా గ్రామపంచాయతీ భవనం, రైతు వేదిక ప్రాంతంలో నీరు నిలిచేదని వివరించారు. మత్తడి ఎత్తు తగ్గించడం వల్ల ప్రస్తుతం వివాదాస్పదమైన భూమిలోకి నీరు రావడం లేదన్నారు. అందుకే ఆ శిఖం భూమి కబ్జాకు గురైనట్లుగా భావిస్తున్నారు.
అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో చెరువు ఎఫ్టీఎల్ పరిధి తగ్గడంతో చెరువు పరిసరాల్లో ఖాళీ స్థలం కనిపించిందన్నారు. అప్పటి పంచాయతీ కార్యవర్గం ఎఫ్టీఎల్ పరిధి దాటిన భూమిని ట్రెంచ్ కటింగ్ ద్వారా వేరు చేశారన్నారు. ఆ భూమిని డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాల కోసం కేటాయించాలని పంచాయతీ కార్యవర్గం భావించినట్లుగా స్థానికులు వివరించారన్నారు. దీన్ని బట్టి చూస్తే మత్తడి ఎత్తు దాదాపుగా ఒక ఫీట్ తగ్గినట్లుగా అంచనా వేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయలో మత్తడి పునర్నిర్మాణంలో మత్తడి ఎత్తు తగ్గించిందెవరు ? లబ్ధి పొందింది ఎవరు ? అధికారులా ? రాజకీయ నాయకులా ? నిగ్గు తేల్చాల్సింది రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులేనన్నది సుస్పష్టం. ఆ రెండు శాఖల పై ప్రస్తుత ప్రభుత్వ పెద్దల ఒత్తిడిలు ఏ మేరకు ఉంటాయో వేచి చూడాల్సిందే...
'దిశ' కథనం పై మాచారెడ్డి ఊర చెరువు పరిరక్షణకై స్థానిక వాట్సాప్ గ్రూపులో చర్చ..
అసలు మాచారెడ్డి ఊర చెరువు విస్తీర్ణం ఎంత అనే విషయమై స్థానిక వాట్సప్ గ్రూపులో గ్రామస్తులు చర్చించారు. 'దిశ' దినపత్రికలో వచ్చిన 'శిఖం భూమి కబ్జా' కథనం పై గ్రామస్తులు పలు విధాలుగా స్పందించారు. అధికారులతో సర్వే జరిపి చెరువు భూమిని పరిరక్షించుకోవాలని, శిఖం భూమిని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యకు అధికారులు చొరవ చూపాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెరువు శిఖం భూమిని కాపాడడం కోసం గ్రామస్తులు ప్రయత్నం చేశారు. వారిపై కేసులు పెట్టారు. గ్రామం కోసం ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.
మాచారెడ్డి ఊర చెరువు విస్తీర్ణం ఎంత ?
మాచారెడ్డి ఊర చెరువు విస్తీర్ణం రికార్డులను 'దిశ' సేకరించింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 242లో 133.26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని ప్రకారం అధికారులు సర్వే చేస్తే ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైందో తెలుస్తుంది. అదేవిధంగా చెరువు మత్తడి లెవెల్స్ తీస్తే ఎఫ్టీఎల్ పరిధి తగ్గిందా అనే విషయం కూడా తెలుస్తుంది. రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా సర్వే చేసి సరిహద్దులను నిర్ధారిస్తే చెరువు శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లు గుర్తిస్తారు. దీంతో ఎఫ్టీఎల్, బఫర్, శిఖం భూమి ఏ మేరకు కబ్జాకు గురైందో బయటపడుతుంది. కానీ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాకు ఇచ్చిన అధికారాలను, సరిహద్దులను నిర్ధారించే పరికరాలు ఎంఎస్ఎల్, డీజీపీఎస్ లతో సర్వే చేసి ఇంటర్ లింక్ చేస్తే ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా సరిహద్దులను నిర్ణయించవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు.