తెలంగాణలో ‘టెట్’ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్..

by Anukaran |   ( Updated:2021-09-19 22:24:15.0  )
తెలంగాణలో ‘టెట్’ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా పోరాడి సాధించిన తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో ప్రభుత్వంపై రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని యువకులు, నిరుద్యోగులంతా రోడ్డెక్కారు. ఇప్పటికే ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అదే కోవలో బీఎడ్, డీఎడ్​ అభ్యర్థులు చేరారు. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రవేశ పరీక్ష నిర్వహించక నాలుగేళ్లు దాటింది.

అయినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయకపోవడంతో డీఎడ్, బీఎడ్​ అభ్యర్థులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసి ప్రవేశ పరీక్ష కోసం దాదాపు 4.50 లక్షల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వేల సంఖ్యలో టీచర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ సీఎస్​ సోమేశ్​కుమార్‌ను 13 డిసెంబర్ 2020న ఆదేశించారు. ఏ శాఖలో ఖాళీలున్నాయో లెక్క తేల్చాలని, అనంతరం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది జరిగి తొమ్మిది నెలలు దాటినా ఆ ప్రక్రియ నేటికీ ముందుకుసాగలేదు. టీచర్ల రేషనలైజేషన్​ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ వేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తికాలేదు. అయితే, ఈ ప్రక్రియ పూర్తై ఖాళీల వివరాలు తెలిశాకే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణవాసుల ఉద్యోగాలన్నీ ఆంధ్రులపాలవుతున్నాయని ఉద్యమిస్తే ప్రత్యేక రాష్ట్రంలోనూ తమకు అన్యాయమే జరిగిందని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా ప్రతీ ఆరు నెలలకోసారి, లేదా ఏడాదికోసారైనా టెట్ నిర్వహించేవారని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే టెట్‌ను నిర్వహించారు. మొదటి టెట్ 2016 మే 22న జరిగింది. పేపర్​1కు 88,158 మంది హాజరైతే 48,278 మంది పాసయ్యారు. పేపర్ 2ను 2,51,924 మంది రాస్తే 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు.

రెండో టెట్‌ను 2017 జూలై 23న నిర్వహించారు. పేపర్ 1కు 98,848 మంది హాజరైతే 56,708 మంది పాసయ్యారు. రెండో పేపర్‌కు 2,30,932, మంది రాస్తే 45,045 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష తర్వాత మరో టెట్​ ప్రభుత్వం చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, కొత్తగా పాస్ అవుట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా 4.50 లక్షలకు చేరుకుంది. ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోగా రాష్ట్రంలో ఇప్పటికే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కొవిడ్ ​సాకుతో 15 వేల మంది విద్యావలంటీర్లను సైతం పక్కన పెట్టింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే విద్యా వలంటీర్లను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఎడ్, డీఎడ్​ అభ్యర్థుల సంఘం సర్కార్‌ను డిమాండ్​ చేస్తోంది.

ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా క్లాసులు చెప్పాలన్నా ఈ అర్హత పరీక్ష తప్పనిసరి. అటు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ప్రైవేట్ పాఠశాలల్లో అయినా క్లాసులు చెబుదామంటే కూడా చాన్స్ లేకుండా పోయింది. నాలుగేళ్లుగా క్రమంగా బీఎడ్, డీఎడ్ కోర్సులు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్ల సంఖ్య రానురాను తీవ్రంగా తగ్గే అవకాశముంది. ఇదిలా ఉండగా రాష్ట్ర సర్కార్ తీసుకున్న వయోపరిమితి నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మరిన్ని తిప్పలు ఏర్పడ్డాయి. ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 61కి చేయడంతో ఖాళీ లేకుండా పోయింది. సాధారణంగా ప్రతీ ఏటా 20వేల మంది టీచర్లు విరమణ చేసే అవకాశం ఉండగా ఈ నిర్ణయంతో ప్రతీ ఏటా వేల సంఖ్యలో అభ్యర్థులు నిరుద్యోగులుగా మారుతున్నారు.

దేశవ్యాప్తంగా టెట్ నిర్వహిస్తున్నారు.. ఇక్కడెందుకు పట్టించుకోవడంలేదు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)ను ప్రతీ ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారైనా నిర్వహిస్తున్నాయి. కానీ, స్వరాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. ఏటా బీఎడ్, డీఎడ్​ కోర్సు పాస్​అవుట్ అయిన వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. బీఈడీ అభ్యర్థులు 3 లక్షల మంది ఉంటే, డీఎడ్ అభ్యర్థులు 1.5 లక్షల మంది మొత్తంగా 4.5 లక్షల మంది ఈ పరీక్ష కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. తెలంగాణ సర్కార్ పట్టించుకొని వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.
= రావుల రామ్మోహన్ రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.

Advertisement

Next Story

Most Viewed