అడవిలో పులి.. అటు వైపు వెళ్లకండి

by Anukaran |
అడవిలో పులి.. అటు వైపు వెళ్లకండి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘‘అడవిలో పెద్ద పులి తిరుగుతోంది. అటు వైపు వెళ్లకండి’’ అంటూ అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు కూడా పోవద్దంటున్నారు. ఈ మేరకు అటవీ పరిసర గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆదివాసీలు అయోమయంలో పడిపోయారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగావ్ మండలం దిగుటలో ఒకరిని, పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామంలో మరొకరిని ఇటీవలి కాలంలో పులి పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

పులి ఎక్కడ మాటు వేస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ముందుగా భిన్నాభిప్రాయాలతో ఉన్న అధికారులు తాజా సంఘటన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నారు. పంటల ఫలితాలు వచ్చే సమయంలో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లవద్దని అటవీ అధికారులు హెచ్చరించడం గ్రామీణులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఒకే పులి వరుసగా దాడులు చేస్తున్నదని, అది కిల్లర్ క్యాట్ ( మ్యాన్ హంటర్) కావచ్చని స్థానికులు భయపడుతున్నారు. అటవీ అధికారులు మాత్రం వేరు వేరు పులులు తిరుగుతున్నాయని అంటున్నారు. అటవీ గ్రామాలలో పులుల సంచారంపై ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పులి సంచారంతోపాటు దాని అడుగు జాడలను తెలుసుకుని తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచిస్తున్నారు. గతంలో ఉన్న వన సంరక్షణ సమితుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. కమిటీల ఏర్పాటు మీద ప్రజాప్రతినిధులతోనూ కసరత్తు చేస్తున్నారు.

Advertisement

Next Story