'అందరికీ అందేలా మీరే చూసుకోవాలి'

by Shyam |
అందరికీ అందేలా మీరే చూసుకోవాలి
X

దిశ, వరంగల్: ‘వారి సంక్షేమం మన బాధ్యత. వాటిపై మీరు వారికి అవగాహన కల్పించాలి. అంతేకాదు వాటిని వారందరికీ చేరేలా మీరే చర్యలు తీసుకోవాలి. అందుకోసం మీ మీ స్థాయిల్లో అవగాహన కల్పించాలి’ అని ఓ పెద్ద ఆఫీసర్ చెప్పారు. ఆయన ఏ సందర్భంలో .. ఎందుకు అలా పేర్కొన్నారో మీరే చూడండి.

ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సోమవారం జిల్లా అధికారులతో పథకాలు, ఆన్ లైన్ హాజరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ వర్గాల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రభుత్వ ఫలాలు పొందేలా అధికారులు కృషి చేయాలన్నారు. శాఖల వారీగా చేపడుతున్న పథకాలపై మండల ప్రత్యేక అధికారులకు శిక్షణ ఇచ్చి, వారు మండల పర్యటనలో గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి, చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామాల్లో ఉన్న యువత ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వెబ్ సైట్ లో శాఖల డేటాతో పాటు, పథకాలు, ఉద్యోగుల వివరాలు పొందుపర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు.. ఇంకా ఎంత మందికి లబ్ధి చేకూర్చాలో జాబితా సిద్ధం చేసి, తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు లేనివారికి, అర్హతలు ఉంటే పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారానికి కనీసం ఒక రోజు మండలంలో పర్యటించి, అభివృద్ధి పనుల పురోగతి, చేపట్టాల్సిన పనులు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. అధికారులు సిబ్బంది హాజరును ప్రతిరోజూ సమీక్షించాలని, జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలని అన్నారు.

Advertisement

Next Story