వికెట్లు పడుతున్నా.. ఈజీగా గెలిచారు

by Shyam |   ( Updated:2021-10-09 10:23:16.0  )
Lady-Cricketer
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా మహిళా జట్టుతో కరారా వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో ఇండియా మహిళలు ఓటమి పాలయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టాపార్డర్‌లో స్మృతి మంధాన (1), షెఫాలీ వర్మ (3), జెమీమా రోడ్రిగ్స్ (7) పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (28), దీప్తి శర్మ (16) పర్వాలేదనిపించగా.. ఆఖర్లూ పూజా వస్త్రాకర్ (37) ఒంటరి పోరాటం చేసింది. లోయర్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో టీమ్ ఇండియా 118 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యింది. ఇక 119 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. టీమ్ ఇండియా మీడియం పేసర్ శిఖా పాండే వేసిన అద్భుతమైన స్వింగ్ బంతికి అలీసా హేలీ (4) క్లీన్ బౌల్డ్ అయ్యింది. బెత్ మూనీ (34), మెగ్ లాన్నింగ్ (15) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే గార్డెనర్ (1), ఎలిస్ పెర్రీ (2) విఫలం అయ్యారు. అయితే తహిలా మెక్‌గ్రాత్ (42) వికెట్లు పడుతున్నా.. ఆఖరి వరకు ఒంటరిగా పోరాడింది. దీంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మహిళలు 4 వికెట్ల తేడాతో ఇండియా మహిళలను ఓడించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. మూడో టీ20 ఆదివారం జరుగనున్నది.

Advertisement

Next Story