పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-ట్రాన్ మోడళ్ల బుకింగ్ ప్రారంభించిన ఆడి ఇండియా

by Harish |
పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-ట్రాన్ మోడళ్ల బుకింగ్ ప్రారంభించిన ఆడి ఇండియా
X

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌ల కోసం మంగళవారం భారత్‌లో బుకింగ్‌లను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఈ ఎస్‌యూవీలకు ఒక్కోదానికి రూ. 5 లక్షల ప్రారంభ బుకింగ్ ధరను నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. అలాగే, ఈ-ట్రాన్ బ్రాండ్‌లో భాగంగా కంపెనీ మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు ఆడి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది చివర్లో ఈ-ట్రాన్ లాంచ్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు, కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో కాస్త ఆలస్యంగా తీసుకొచ్చామని, ఈ పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ద్వారా దేశంలో కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని ప్రారంభించినట్టు వెల్లడించింది.

‘భవిష్యత్తు ఆటో పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలకంగా ఉండనున్నాయి. ఈ క్రమంలో ఏకంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం బుకింగ్‌లను మొదలుపెట్టడం సంతోషంగా ఉందని’ ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ చెప్పారు. ఈ-ట్రాన్ మోడళ్ కేవలం ఒకటే కాదు రానున్న రోజుల్లో ఈ బ్రాండ్ కింద అనేక కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాం. ఇది కార్లు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త శకానికి నాది అని ఆయన అభిప్రాయపడ్డారు. వినియోగదారులు ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌లను ఆన్‌లైన్‌లో కంపెనీ వెబ్‌సైట్ ద్వారానో లేదంటే ఆడి ఇండియా డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ రెండు వాహనాలు 8.5 గంటల్లో 11 కిలోవాట్ల ఏసీ హోమ్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసుకోవచ్చని, ఇవి కేవలం 5.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story