కాసేపట్లో కేజ్రీవాల్, మోదీకి ఢిల్లీ పరీక్ష మొదలు

by Shamantha N |
కాసేపట్లో కేజ్రీవాల్, మోదీకి ఢిల్లీ పరీక్ష మొదలు
X

కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీకి పరీక్ష ప్రారంభం కానుంది. దేశం అంతా ఒకెత్తు, ఢిల్లీ ఒక్కటే ఒకెత్తు. దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీకి కూడా కీలకం. అభివృద్ధే లక్ష్యంగా ఒకరు ప్రచారం చేస్తే.. ఛరిష్మాతో గెలవాలని మరో పార్టీ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఎన్నికలు షురూ కానున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. నేటి ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కానుంది. 1.47 కోట్ల మంది ఓటర్లున్న ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఢిల్లీలో అధికారం లేకపోవడంతోనే సీఏఏ, ఎన్నార్సీ వంటి కీలక అంశాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలావాలని నిర్ణయించుకుంది. ఢిల్లీలో విజయం సాధించాలంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని భావించిన బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది.

ఆధారపడితే మోదీ, అమిత్‌ షా పూర్తిగా భావోద్వేగ అంశాలపైనే ఆధారపడి ప్రచారం చేశారు. తొలుత కేంద్రంలోని తమ పాలన, విజయాలను ఏకరువు పెట్టిన ఆ నేతలు.. తరువాత సీఏఏపై విపక్షాలు, ద్రోహులు, పాకిస్థానీలు అంటూ ప్రచార పంథాను మార్చింది. అది కూడా సత్ఫలితాలిస్తుందా? అన్న మీమాంసతో పార్లమెంటు సాక్షిగా.. రామజన్మ భూమి ట్రస్టు అంశాన్ని అకస్మా్త్తుగా తెరమీదికి తెచ్చింది. దీంతో ఈ సారి విజయం తమదేనన్న దీమా బీజేపీలో కనిపిస్తోంది. అయితే మీడియా సంస్థలతో పాటు ఎన్నికల సర్వేలు నిర్వహించే ఏ సంస్థ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పకపోవడం విశేషం. ఇదే క్రమంలో ఢిల్లీలో ఎవరూ అంచనావేయని ఫలితాలు చూస్తారంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మరోవైపు కేజ్రీవాల్ పరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరిట ప్రచారం చేశారు. ప్రచారంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరైనా వారితో బహిరంగ చర్చకు సిద్ధమన్న సవాలు విసిరారు. ఈ సవాలును బీజేపీ స్వీకరించలేదన్నది తరువాతి విషయం. దీంతో కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకెళ్లారు. మరోవైపు బూత్ మేనేజ్మెంట్ విషయంలో ఆప్ పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించడంతో మరోసారి ఆపార్టీనే విజయం వరించనుందంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సర్వేల తీరు చూస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీయే మళ్లీ జయకేతనం ఎగురవేయవచ్చని స్పష్టమవుతోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారని ప్రశ్నించినపుడు 45.4 శాతం మంది ఆప్‌ వైపే మొగ్గు చూపినట్లు ఐఏఎన్‌ఎస్-సీఓటర్‌ సర్వే వెల్లడించింది. గతంలో బాగా వెనుకబడ్డ బీజేపీ ఎన్నికల నాటికి పుంజుకొని 36.6 శాతం మంది మద్దతు సాధించగలిగింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని మార్చాలా అన్న ప్రశ్నకు అవసరం లేదని 58.1శాతం, మార్చాలని 39.2 శాతం మంది ఓటేశారు. సీఎంగా కేజ్రీవాలే ఉండాలని 60.2శాతం కోరుకొన్నారు. దీంతో కేజ్రీవాల్ విజయం లాంఛనమేనని అర్ధమవుతోంది.

మరోవైపు విపక్షాలన్నీ కేజ్రీవాల్ కు మద్దతు పలుకుతున్నాయి. ఎన్నికలకు 12 గంటల ముందు ఆప్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ శివసేన చేసిన ప్రకటన ఆ పార్టీకి మరింత సానుకూలంగా మారింది. దీంతో ఢిల్లీ పీఠంపై మరోసారి కేజ్రీవాల్ కూర్చోవడం లాంఛనమేనని, ఢిల్లీ ఓటర్ల ఆప్ ను అక్కునజేర్చుకోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed