ఆర్మూర్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కేసీఆర్

by Shyam |
cm-kcr
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని 100 పడకల దవాఖానాగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకప్పుడు ఈ ఆస్పత్రికి రావాలంటేనే జనం భయపడేవారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ వలన ఇందులో పలు సౌకర్యాలు కల్పించారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన వైద్యులు ఉత్తమ సేవలు అందించేలా కృషి చేశారు. ఫలితంగా రాష్ట్రంలోని 30 పడకల ఆస్పత్రుల్లో ఆర్మూర్ మొదటి స్థానంలో నిలిచింది.

గర్భిణులకు నార్మల్ డెలివరీలు చేయడంలో ఉత్తమ సేవలందిస్తున్న దవాఖానగా ఆర్మూర్ పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగింది. భవనం చిన్నగా ఉండటంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. 100 పడకల హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక ఇందులో వసతులు మెరుగుపడే అవకాశం ఉన్నది. నిధులు పుష్కలంగా విడుదలవుతాయి. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం మరింత చేరువ కానున్నది. 30 పడకల దవాఖానగా ఉన్న ఆర్మూర్ ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని వంద పడకల దవాఖానగా గుర్తిస్తూ జీవో చేసిన సీఎం కేసీఆర్‌‌కు ఈ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed