కరోనా చికిత్స పర్యవేక్షణకు నిపుణుల కమిటీ

by Shyam |
కరోనా చికిత్స పర్యవేక్షణకు నిపుణుల కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్, మైక్రో బయాలజీ, అంటువ్యాధుల విభాగం, సైకియాట్రీ తదితర రంగాల్లోని నలుగురు డాక్టర్లతో పాటు నీలోఫర్ ఆసుపత్రికి చెందిన అనెస్థీషియా నిపుణులు కూడా సభ్యులుగా ఉంటారు. కరోనా పేషెంట్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇంకా ఎలాంటి చర్యల ద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చు అనే అంశంపై ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి, నిరంతరం పర్యవేక్షిస్తుందని, వీరు ఇచ్చే సూచనలు, సలహాల ద్వారా ఆయా ఆసుపత్రులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రిజ్వి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీతో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, శాఖ కార్యదర్శి కూడా సందర్భానుసారం సంప్రదింపులు జరుపుతారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed