జగన్ గారూ ఇది న్యాయమా?.. విద్యార్థుల కంటే ఎక్కువా?

by srinivas |
జగన్ గారూ ఇది న్యాయమా?.. విద్యార్థుల కంటే ఎక్కువా?
X

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచే ఎన్నికల షెడ్యూల్ ఆరంభం కానుంది. ఈ నెల 29తో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ షెడ్యూల్ ఏపీలో వివాదాస్పదమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యవసరమా? లక్షలాది భవిష్యత్ కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతకీ ఈ ప్రశ్నలకి కారణమేంటంటే…

స్థానిక సంస్థల ఎన్నికలు తొలి విడత ఈ నెల 21న జరుగునున్నాయి. రెండో విడత ఎన్నికలు ఈ నెల 23న జరుగనున్నాయి. కౌంటింగ్ ఈ నెల 29న జరుగనుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. మాకు ఓటెయ్యండంటే మాకు ఓటెయ్యండి అంటూ పార్టీలు, అభ్యర్థుల హడావుడికి అంతుండదు. హోరాహోరీ పోటీ ఉన్న కొన్ని చోట్ల లౌడ్ స్పీకర్లు, మైకులు కూడా వాడి ప్రచారం చేసుకుంటారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 23 నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల చేయడం సమంజసమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పదవ తరగతి పరీక్షలు మార్చి నుంచి ఏప్రిల్‌కు వాయిదా వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల కోసం ఇప్పటికే విద్యార్థులు కఠోరపరిశ్రమ చేశారు. సకాలంలో పరీక్షలు నిర్వహిస్తే, సకాలంలో ఫలితాలు వెల్లడించవచ్చు. సకాలంలో కళాశాలల్లో అడ్మిషన్లు కూడా జరుగుతాయి.

ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్ గందరగోళంలో పడుతుంది. స్థానిక ఎన్నికలు నెల ఆలస్యంగా జరిగితే నష్టపోయేది లేదు. ఆఘమేఘాలపై ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకోవడం అవసరమా? ముఖ్యమంత్రిగారూ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటనతో నిర్ధారణ కావడం విశేషం. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags : ap, local body elections, 10th exam, election commission,

Advertisement

Next Story

Most Viewed