లోకేష్ మానసిక పరిస్థితి పై అనుమానంగా ఉంది.

by Anukaran |
ap
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరు. సీఎం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీవసలు బయట తిరగలేవు. గుర్తు పెట్టుకో అంటూ గట్టిగా హెచ్చరించారు. ఇవాళ ప్రజల హృదయాల్లో ఉన్న ముఖ్యమంత్రి.. కోట్లాది ప్రజలకు ఎప్పటికప్పుడు సాయం చేస్తున్నారని కొనియాడారు. నీకు ఏమైనా సమస్యలు కనిపిస్తే, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. అంతే తప్ప నోటికి ఏది వస్తే అదే పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని హితవు పలికారు. భాష మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

నారా లోకేశ్ పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటనలో సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. లోకేశ్ మాటలు వింటుంటే అతడి ఆరోగ్యంపై అనుమానం కలుగుతోందన్నారు. సాక్షాత్తూ గౌరవ సీఎంను పట్టుకుని గాలిగాడు అని మాట్లాడటం చూస్తుంటే.. అతడి మాటలు కొవ్వెక్కి మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయంటూ మండిపడ్డారు. అతడు ఒళ్లు మరిచి మాట్లాడుతున్నాడా అంటూ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై అనుచిత పిచ్చి విమర్శలు మానుకోవాలని లేకపోతే ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

టీడీపీ హయాంలో 3,110 ఇళ్లే నిర్మించారు.. మా ప్రభుత్వం 16వేల ఇళ్లు నిర్మించింది

పోలవరం నిర్వాసితుల సమస్య కొత్తగా వచ్చింది కాదని.. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్నారు. కమిషన్లు వచ్చే పనులే చేసి.. గిరిజనులను గాలికొదిలారని ఆరోపించారు. స్పిల్‌వే కాకుండా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు చేపట్టారని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు హయాంలో 3,110 ఇళ్లు నిర్మిస్తే..ఈ రెండేళ్లలో 47 కాలనీల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి కన్నబాబు తెలియజేశారు. 16 వేల ఇళ్లు కట్టి నిర్వాసితులతో గృహ ప్రవేశాలు చేయించామని ఈ విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.

ఇంకా నిర్వాసితుల కోసం 1,02,491 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.. గిరిజనేతరుల ఒక్కో ఇంటికి రూ.3.35 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల ఒక్కో ఇంటికి రూ.3.59 లక్షలు ఇస్తున్నామని వెల్లడించారు. నిర్వాసితుల సమస్యలపై ఐఏఎస్‌ అధికారిని సైతం నియమించామని.. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల రూ.550 కోట్ల భారం పడుతున్నా భరిస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed