ఏపీ ప్రభుత్వానికి రెండు కేసుల్లో హైకోర్టు మార్గదర్శకాలు

by srinivas |
ఏపీ ప్రభుత్వానికి రెండు కేసుల్లో హైకోర్టు మార్గదర్శకాలు
X

స్థానిక ఎన్నికల నిర్వహణలోపు ప్రభుత్వ భవనాలకు వేసిన వైఎస్సార్సీపీ పార్టీ గుర్తును తలపించేలా ఉన్న రంగులు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రంగులు తొలగించడానికి ఏపీ సర్కార్ మూడు వారాల గడువు కోరగా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రంగులు మార్చే వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించరాదని ఈ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరో మూడు వారాలపాటు వాయిదాపడినట్టేనని తెలుస్తోంది. ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించి, కమిటీ సూచనల మేరకు రంగులు వెయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఈ రోజు హైకోర్టులో..

గంట సేపు వాద, ప్రతి వాదాలు జరిగాయి. రమేష్ కుమార్ వేసిన ఈ కేసులో శనివారం ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయగా, ఆదివారం రిప్లయ్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఆర్డినెన్స్‌ తెచ్చామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలు అవాస్తవమని తెలిపారు. ఎస్‌ఈసీ పదవి నుంచి తనను తొలగించేందుకే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని ఆరోపించారు. ఆర్డినెన్స్‌ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనదని, దురుద్దేశపూరితమైనదని న్యాయస్థానానికి తెలిపారు.

దీనిపై అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ నెల 24 లోగా అడిషనల్ కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్ట్ ఆదేశించింది. ప్రతిగా కౌంటర్ దాఖలు చెయ్యటానికి పిటిషనర్లకు 27 వరకు గడువునిచ్చింది. ఈ కేసులో తుది విచారణ 28వ తేదీన చేపట్టనున్నామని ప్రకటించింది. తేదీల విషయంలో ప్రభుత్వానికి కానీ, పిటిషనర్లకు కానీ ఎలాంటి మినహాయింపులుండవని స్పష్టం చేసింది.

Tags:high court, andhra pradesh government, ysrcp, panchayath colors, sec,nimmagadda ramesh kumar

Advertisement

Next Story

Most Viewed