కరెంట్ వాత.. ప్రజలపై కోట్ల భారం.. సర్కారు న్యూ ఇయర్ గిఫ్ట్..!

by srinivas |
jagan
X

కొత్త సంవత్సరం ప్రజలకు విద్యుత్ చార్జీల భారం తప్పేలా లేదు. ఇప్పటి వరకు ఉన్న మూడు కేటగిరీలను రెండుకు కుదించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. గత కొన్నేళ్లుగా విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. వాటి నుంచి గట్టెక్కేందుకు ఈ సరికొత్త ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తున్నది. డిస్కంల ప్రతిపాదనలు పరిశ్రమలకు మేలు చేసేలా ఉండటం గమనార్హం. 0–50 యూనిట్లు వాడే సంస్థలకు చార్జీలు తగ్గనున్నాయి. యూనిట్‌కు రూ.6.90 వసూలు చేస్తుండగా.. దానిని రూ. 5.40కు తగ్గించాయి. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే గృహ విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడే ఛాన్స్ ఉంది.

దిశ, ఏపీ బ్యూరో: కొత్త ఏడాదిలో వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు షాక్ ఇవ్వబోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్లాబు‌లకు అవి సవరణలు చేశాయి. ఈ మేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. ఒకవేళ వీటికి గనుక అనుమతి వచ్చినట్లయితే రాష్ట్రంలోని గృహ వినియోగదారులపై పెనుభారం పడినట్లే. ఆ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రజలపై రూ.3,685 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఈ చార్జీలను కొత్త ఏడాదిలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

ఇకపై రెండే కేటగిరీలు

ప్రస్తుతం విద్యుత్ వినియోగాన్ని బట్టి ఏ, బీ, సీ అంటూ మూడు కేటగిరీలుగా ఉన్న వినియోగదారులను విద్యుత్ పంపిణీ సంస్థలు రెండు వర్గాలుగా కుదించాయి. వీటిలో కూడా మళ్లీ స్లాబుల వారీగా మార్పులు చేసి డిస్కంలు ప్రతిపాదించాయి. దాంతో సామాన్యులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘ఏ’ కేటగిరీ‌లో ఉన్న 50 యూనిట్లలోపు విద్యుత్ వాడే వాళ్లకు రూ. 1. 45 చొప్పున వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే గృహ వినియోగదారుడిని 50కి బదులుగా 30 యూనిట్లకు కుదించింది. దానివల్ల 30 యూనిట్ల వాడకం వరకూ రూ.1.45, మిగిలిన 20 యూనిట్లకూ రూ.2.80 చొప్పున వసూలు చేయనున్నాయి. అంటే ఇప్పటి వరకు 50 యూనిట్లకు రూ.72.50 చెల్లిస్తున్న వినియోగదారుడు విద్యుత్ డిస్కంల కొత్త ప్రతిపాదన అమలైతే రూ.99.50 చెల్లించాల్సి వస్తుంది.

AP govt

పరిశ్రమలకు ఊరట

ఈ సవరణల ప్రతిపాదనల్లో పరిశ్రమలకు మాత్రం ఊరట కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చేలా వాణిజ్య పరిశ్రమలకు విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించాల‌ని డిస్కంలు ప్ర‌తిపాదించాయి. హైటెన్షన్‌ విద్యుత్‌ సర్వీసులైన 11 కేవీ, 33 కేవీ, ఈహెచ్‌టీల టారిఫ్‌లలో మార్పులేదని పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం 0-50 యూనిట్లు వాడే ప‌రిశ్ర‌మ‌ల‌కు యూనిట్‌ రూ.6.90లు వసూలు చేస్తున్నారు. దానిని రూ.5.40 పైసలకు తగ్గించారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు విధించే టారిఫ్‌ల‌పై మార్పు లేద‌ని తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య పరిశ్రమలను ఆకర్షించేలా ఈ నిర్ణయం తీసుకోవడం సబబే అన్న వాదనలు వినవస్తున్నాయి.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలి

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో మాత్రం విద్యుత్ పంపిణీ సంస్థలు కాస్త ఉదారంగానే ప్రతిపాదించాయి. రాష్ట్రంలోని అన్నదాతలపై అదనపు భారం పడేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ అంశం జోలికి వెళ్లకపోవడమే మంచిదని డిస్కంలు భావించడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

విద్యుత్ డిస్కంల ప్రతిపాదనలివే..

నూతన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం ఇకపై 0-30 యూనిట్ల గృహ విద్యుత్ వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 పైసలు వసూలు చేసేందుకు అనుమ‌తి కోరాయి. అలాగే 31-75 యూనిట్ల‌కు రూ.2.80 పైసలు, 0-100 యూనిట్ల‌కు రూ.4లు, 101-200 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.5 లు, 201-300 యూనిట్ల విద్యుత్‌కు రూ.7, 300 యూనిట్లపైన వాటికి రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం ఉన్న 301-400 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 యూనిట్ల క‌రెంట్ వాడ‌కానికి రూ. 8.50 పైసలు, ఆ పైన విద్యుత్ యూనిట్ల వినియోగానికి రూ. 9.95 పైసలు చొప్పున చార్జీలు విధించాలని కోరాయి.

పేరుకున్న అప్పులే కారణం

గత కొన్నేళ్లుగా విద్యుత్ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. 2014 నుంచి 2021 మార్చి 31 నాటికి విద్యుత్ డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని పేర్కొన్నాయి. 2021 నవంబర్ నాటికి 29,536 కోట్ల మేర నిర్వహణ మూలధన రుణాలు ఉన్నాయని పేర్కొన్నది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ బకాయిలు రూ.9,210 కోట్లతో కలిపి మొత్తం రూ.13,560 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపాయి. ఈ భారాలన్నింటి నుంచి విద్యుత్ డిస్కంలు బతికి బయట పడాలంటే కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు తప్ప మరోదారి లేదని అవి అంటున్నాయి. అయితే ఆ సంస్కరణలకు ఆమోద ముద్ర పడితే సామాన్యుడిపై అదనపు భారం తప్పదు. మరి ఈ అంశాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Advertisement

Next Story