ఏపీలో ఎన్నికలు ఎందుకు నిర్వహించాలంటే.. లేఖలో సీఎస్

by srinivas |
ఏపీలో ఎన్నికలు ఎందుకు నిర్వహించాలంటే.. లేఖలో సీఎస్
X

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి ఉన్న ప్రత్యేక అధికారాలు వినియోగించి ఎలక్షన్లను రద్దు చేయడంపై రాష్ట్రపతికి సీఎం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఆ లేఖలో స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని సూచించారు. ఎన్నికలను 6 వారాల వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నాద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితాలు ముద్రణ వంటి అంశాలు ఇప్పటికే పూర్తయ్యాయని ఆమె ఎన్నికల సంఘానికి లేఖలో వివరించారు.

ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆమె ఎన్నికల సంఘానికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి ఉంటే కరోనాపై రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉన్న తీరుపై వాస్తవ నివేదికను అందించేవాళ్ళమని ఆమె వెల్లడించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. కావాలంటే చూసుకోండంటూ వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదికను కూడా ఆయనకు పంపించారు.

విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టే ప్రతి ప్రయాణికుడ్ని స్క్రీంనింగ్ చేశామని, అప్పటికీ అనుమానితుల ఇళ్లకు వెళ్లి వైద్యసేవలందించే చర్యలు చేపట్టామని ఆమె వెల్లడించారు. ప్రజారోగ్య సంరక్షణకు సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్న తరుణంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆమె సూచించారు. విపత్కర పరిస్థితుల్లో స్థానిక సంస్థల చాలా సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుందని, 3,4 వారాల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టామని, అందుకే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె లేఖలో ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story