వైసీపీలో పోటీ… జగన్ కేబినెట్‌లో చోటెవరికి?

by srinivas |   ( Updated:2021-09-25 10:31:13.0  )
వైసీపీలో పోటీ… జగన్ కేబినెట్‌లో చోటెవరికి?
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ విజయదుందుభి మోగించింది. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వేవ్ నడిచింది. వైసీపీ వేవ్ ముందు ఇతర పార్టీలు నిలబడలేకపోయయి. టీడీపీ, జనసేన పార్టీలు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో రాష్ట్రంలో తమకు ప్రత్యర్థులు లేరని వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల హడావిడి ముగిసిపోవడంతో సాధారణ ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా మంత్రివర్గ విస్తరణకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే రెండున్నరేళ్ల అనంతరం కేబినెట్ విస్తరణ జరుగుతుందని, నూటికి 90 శాతం మంది మంత్రులను మార్చేస్తానంటూ ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొంతమంది మంత్రులు సేఫ్‌జోన్‌లో ఉంటారని ప్రచారం జరిగింది. అయితే సీఎం జగన్ 100 శాతం మంత్రులను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆశావాహులు జగన్ కేబినెట్‌లో బెర్త్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

వార్ వన్‌సైడ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో దాదాపు 80 శాతం హామీలను ఏడాదిన్నరలోపు అమలు చేసింది. మేనిఫెస్టోలో అమలు చేయలేని హామీలను సైతం అమలు చేసి ప్రజలకు మరింత దగ్గరైంది వైసీపీ ప్రభుత్వం. దీంతో ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు సరైన పోటీ ఇవ్వలేదు. ఎన్నికల్లో అనేక పార్టీలు పోటీ చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం వైసీపీకే బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికలలో ఫ్యాన్ గాలి ముందు సైకిల్, గాజు గ్లాసులు ఏమాత్రం నిలబడలేకపోయాయి. దీంతో వైసీపీ శిబిరంలో పండుగ వాతావరణం నెలకొంది.

కేబినెట్ విస్తరణపై జగన్ దృష్టి

రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోయింది. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. మూడు ఎన్నికల్లో భారీ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. శుక్రవారం ఎంపీపీ ఎన్నిక ముగియగా…శనివారంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తైంది. ఎన్నికల వాతావరణం ముగియడంతో సీఎం జగన్ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని.. కేబినెట్‌లో ఎవరికి కొత్తగా బెర్త్ లు ఇవ్వాలి?.. ఎవర్ని పక్కన పెట్టాలి? అన్నదానిపై సీఎం జగన్‌ అండ్ కో వ్యూహరచన చేస్తోందని ప్రచారం జరుగుతుంది. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అని వార్తలు రావడంతో ఆశావాహులు బెర్త్‌ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలుతున్నారు. మరికొందరైతే సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

కేబినెట్‌లో వందశాతం మంత్రుల మార్పు- మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ మరికొన్ని రోజుల్లో జరగబోతుందని ఏపీ మంత్రి, సీఎం జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న 100 శాతం మంత్రులను మారుస్తారని వెల్లడించారు. ఖచ్చితంగా కొత్త మంత్రులతో కేబినెట్ ఉండబోతుందని చెప్పుకొచ్చారు. పార్టీ తీసుకోబోతున్న నిర్ణయానికి అంతా విధేయులై ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. 100 శాతం మంత్రులను మార్చుతున్న తరుణంలో తాను కూడా పదవి కోల్పోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తనకు మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఒక్కటేనని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, పార్టీయే ముఖ్యమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

సీనియర్ మంత్రుల ఆశలపై నీళ్లు చల్లిన బాలినేని

వైఎస్ జగన్ కేబినెట్‌లో కొందరు సీనియర్ మంత్రులు ఉన్నారు. అలాగే మరికొందరు మంత్రులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. అంతేకాదు సీఎం జగన్‌కు అసెంబ్లీలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కొంతమంది మంత్రులు ఆయా ప్రాంతాలకు నాయకత్వం వహిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఒకవైపు మంత్రులుగా వ్యవహరిస్తూనే…పార్టీ బాధ్యతలను సైతం తమ భుజాన వేసుకుంటున్నారు. అలాంటి మంత్రులకు కేబినెట్‌లో ఉద్వాసన ఉండకపోవచ్చనే ప్రచారం జరిగింది. రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత, నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా నుంచి విశ్వరూప్, ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌లు సేఫ్ జోన్‌లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో వందశాతం మంత్రులను మారుస్తారంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించడం సీనియర్ మంత్రుల్లో ఆందోళన నెలకొంది. తమ బెర్త్ ఉంటుందా ఊడిపోతుందా అన్న ఆలోచనలో సీనియర్లు పడ్డారు.

ఆశావాహుల జాబితా పెద్దదే

2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ.. జ‌గ‌న్ కేబినేట్‌లో చోటు ద‌క్కించుకోలేక‌పోయినవారిలో అనేకమంది ఉన్నారు. వారందర్నీ శాంతింపజేసేందుకు నాడు సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్లకు మారుస్తామని హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు. దీంతో పార్టీలో ఎలాంటి అలజడులు, అసంతృప్తి చోటు చేసుకోలేదు. వీరంతా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఎమ్మెల్యేల పాత్రను గుర్తిస్తూ తమకు అవకాశం ఇస్తారని ఆశపడుతున్నారు. ఈసారి మంత్రి పదవులను ఆశిస్తున్న వారి జాబితాలో చిత్తూరు జిల్లా నుంచి నగరి ఎమ్మెల్యే రోజా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డిలతోపాటు శిల్పా చక్రపాణిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, ఆనం రామనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పార్ధసారధి, జోగి రమేష్‌, తోట త్రిమూర్తులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఎవరికి పట్టం కట్టబోతున్నారు…? ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు..? ఏయే జిల్లాల నుంచి ఎవరికి ఇవ్వబోతున్నారు? అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed