CJI Sanjiv Khanna : ‘ఢిల్లీలో చెట్ల నరికివేత’ పిటిషన్లను నేను విచారించలేను

by Hajipasha |
CJI Sanjiv Khanna : ‘ఢిల్లీలో చెట్ల నరికివేత’ పిటిషన్లను నేను విచారించలేను
X

దిశ, నేషనల్ బ్యూరో : కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీకి ఊపిరులు ఊదుతున్న హరిత నెలవు ‘ఢిల్లీ రిడ్జ్’ ఏరియా(Delhi ridge). అటువంటి ప్రాధాన్యం కలిగిన వన్య ప్రాంతంలో అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం గతంలో వందలాది చెట్లను నరికివేశారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లు సోమవారం రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna)తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. అయితే వాటిని విచారించేందుకు సీజేఐ నిరాకరించారు. అందుకు గల కారణాన్ని ఆయన వెల్లడించారు.

‘‘నేను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న టైంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాతో కలిసి బిహార్‌లోని పాట్నా పర్యటనకు వెళ్లాను. పాట్నాలోని జైళ్లలో ఉన్న పరిస్థితులను మేమిద్దరం కలిసి పరిశీలించాం. ఈ పిటిషన్లలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పక్షం కూడా ఉంది. అందుకే నేను వాటిని విచారించడం తగదు’’ అని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. తాను సభ్యుడిగా లేని సుప్రీంకోర్టులోని మరో బెంచ్‌కు ఈ పిటిషన్ల విచారణను బదలాయించాలని ఆయన ఆదేశించారు. నవంబరు 27 తర్వాత సుప్రీంకోర్టులోని మరో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని సీజేఐ వెల్లడించారు. ఇక అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం ‘ఢిల్లీ రిడ్జ్’ ఏరియాలో 642 చెట్లను నరికివేశామని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) కోర్టు ఎదుట ఒప్పుకుంది. అయితే దాదాపు 1,670 చెట్లను అక్రమంగా నరికివేశారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story