గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

by srinivas |
AP BJP chief Somu Veerraju
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలోని దేవాలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా వినుకొండలో సోము వీర్రాజు పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన గోవధ చట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే అంటున్నారని, గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసి భారతీయులను కించపరుస్తారా? అని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేశాల మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని.. లేకపోతే సీఎం జగన్ ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు. జెరూసలెం, మక్కా వెళ్లే వారికి నిధులు ఇచ్చినట్లే.. తిరుపతికి వెళ్లడానికి హిందువులకు కూడా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed