మేం వెధవలమా..?: స్పీకర్ తమ్మినేని సతీమణి ఆగ్రహం

by srinivas |
tammineni vanisree
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆముదాలవలస నియోజకవర్గం తొంగర గ్రామ సర్పంచ్ గా ఆమె పోటీ చేసి గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఆమె గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామంలో పేరుకుపోయిన సమస్యలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతోన్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా రహితంగా.. నామ్ కే వాస్తేగా అందుతోన్న భోజనం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు ఫోన్‌లో సంబంధిత అధికారిపై నిప్పులు చెరిగారు.

అధికారులు ఫైవ్‌స్టార్ హోటళ్లలో తింటూ పిల్లలకు రుచీ, పచీలేని ఆహారాన్ని అందజేస్తోన్నారని మండిపడ్డారు. విద్యార్థుల భోజనానికి ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంటే.. నాణ్యత లేని ఆహారాన్ని ఎందుకు సరఫరా చేస్తోన్నారంటూ ఆమె మండిపడ్డారు. విద్యార్థులకు ఇచ్చింది సాంబారా? నీళ్లా? అనేది అర్థం కావట్లేదని అన్నారు. 'మీ ఇంట్లో ఇలాంటి భోజనమే తింటారా?..' అని ప్రశ్నించారు. మొన్నే తాను పిలిచి వార్నింగ్ ఇచ్చినా.. తీరు మార్చుకోలేదని మరోసారి హెచ్చరించారు.

ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృఫ్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. పులిహోర, కిచిడీ అంటూ ఇచ్చే ఆహారాన్ని తిన్న పిల్లలకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో అధికారులు ఫైవ్ స్టార్ హోటళ్లలో తింటూ పిల్లలకు కనీస నాణ్యత లేని ఆహారాన్ని ఇస్తోన్నారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయబోనని, కఠిన చర్యలు తీసుకుంటానని వాణిశ్రీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed