- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మన ఊరి సంపద.. డంగు సున్నం తయారుచేసే రాయి ఎక్కడుందంటే ?
దిశ, ఫీచర్స్: ఐదారు దశాబ్దాల క్రితం గ్రామాల్లో ఎన్నోసౌధాలు కనిపించేవి. కానీ కాలక్రమేణా ఆ భవంతుల్లో ఉన్న మనుషులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ పట్టణాలకు చేరుకోవడంతో నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ సౌధాలను డంగు సున్నంతో నిర్మించగా.. అప్పుడు సున్నం తయారీకి ఉపయోగించిన రాయి ఆనవాళ్లు కూడా దాదాపు కనుమరుగైపోతున్నాయి. ఇదేక్రమంలో పల్లె సంస్కృతిని ప్రతిబింబించే అనేక వస్తు సంపదను సేకరించి భద్రపరుస్తున్నాడు ఔత్సాహిక పురావస్తు చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి. భావితరాలకు పురాతన విజ్ఞానాన్ని అందించేందుకు కృషిచేస్తున్న ఆయన.. తాజాగా కరీంనగర్‌లో డంగు సున్నం రాయిని గుర్తించారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ మండలం, గంగిపల్లి గ్రామంలోని ఊర చెరువు పైభాగాన డంగు సున్నం తయారు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. 50 ఏళ్ళ కిందట గ్రామీణ ప్రాంతాల్లోని భూస్వాములు మిద్దెలు లేదా భవంతులను ఈ డంగు సున్నంతో నిర్మించుకునేవారు. సిమెంట్ అందుబాటులోకి రావడంతో క్రమంగా సున్నం వాడకం తగ్గిపోయింది. అయితే ఈ డంగు సున్నం తయారు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. భూమిపై వలయాకారంలో రెండు వరుసల్లో రాళ్లతో కట్టిన కాలువ, అందులో తిరగడానికి వీలుగా ఒక బరువైన రాతి గుండు, దాని మధ్యలో రంధ్రం ఎద్దులను కట్టడానికి వీలుగా ఉంటుంది. సున్నం, ఇసుక కలిపి రుబ్బడానికి డంగు బండ బాగా ఉపయోగపడుతుంది. డంగు సున్నంతో కట్టిన చారిత్రక కట్టడాల మరమ్మతుల్లో భాగంగా.. వాటి సహజత్వం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ డంగు సున్నం మిశ్రమాన్ని వినియోగిస్తారు. దీన్ని డంగు సున్నం, బెల్లం, కరక్కాయ, కలబంద, గోడి గుడ్డు తెల్లసొన, జనపనార వంటివి ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో తయారుచేస్తారు.
గ్రామ మ్యూజియం..
ప్రతీ గ్రామం.. అనేక పురావస్తు సంపదను కలిగి ఉంటుంది. వాటిని ఒక చోటికి చేర్చి గ్రామ గ్రామాన ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసుకోవచ్చు. గానుగు రాయి, డంగు సున్నం, విసుర్రాయి, కల్వం, మోట బొక్కెన, కుందెన, పాతాళ గరిగె, మామిడి కాయ తాళం, కాగులు, కొప్పెర, గంగాళం చెక్క బొమ్మలు, వివిధ వృత్తుల పనిముట్లు, మట్టి గాజులు, సవారీ కచ్రం.. ఇలా అనేక వస్తుసంపదతో విలేజ్ మ్యూజియంగా రూపుదిద్దుకోవచ్చు. దీంతో భావితరాలకు చరిత్రను కళ్ళ ముందే నిలిపినట్లవుతుంది.
చాలా గ్రామాల్లో ఇప్పటికీ తాళపత్ర గ్రంథాలు, ఘంటం వంటి వివిధ కాలాలకు చెందిన నాణేలున్నాయి. ప్రజలు వాటిని పట్టణ మ్యూజియంలకు ఇవ్వకుండా ఇళ్లలోనే దాచిపెట్టుకోవడంతో అవి పాడై పోతున్నాయి. కాబట్టి గ్రామ మ్యూజియం ఏర్పాటు చేస్తే ఆ వస్తువులు వారి కళ్ళ ముందే ఉంటాయని ఇవ్వడానికి అంగీకరిస్తారు. ఆయా వస్తువుల ముందు దాతల పేర్లు ఉండేలా చేస్తే మ్యూజియం ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంది. తెలంగాణలో ప్రతి గ్రామంలో నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం, శాతవాహనుల కాలంనాటి కుండ పెంకులు, ప్రాచీన ఇనుము, ఇత్తడి, చిట్టెపు రాళ్ళతోపాటు గోదావరి తీర గ్రామాల్లో శిలాజాలు కూడా లభిస్తాయి. వీటన్నింటినీ మ్యూజియంలో చేర్చితే విజ్ఞాన భాండాగారంగా మారుతుంది. దాంతో విద్యార్థులకు పరిశోధనాశక్తి పెరుగుతుంది. పెళ్లిళ్లు, పండుగలప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆయా గ్రామాల చరిత్ర ఈ మ్యూజియం ద్వారా తెలుసుకోవచ్చు. పల్లెల్లో వృథాగా పారేసే వస్తువులను సేకరించి దమ్మిడి ఖర్చు లేకుండా మ్యూజియం ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి, గ్రంథాలయానికి లేదా పాఠశాలకు అనుబంధంగా ఒక గది నిర్మించి ప్రదర్శనకు పెట్టాలి. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తే ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటాయి.