హుజురాబాద్ ఖాతాలో మరో రికార్డు.. ఓటర్ల కన్నా ‘అవే’ ఎక్కువ.?

by Anukaran |
Huzurabad by-election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉప ఎన్నికల్లో ఎన్నెన్నో సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. అందులో కండువాలు కప్పే సిత్రాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న గ‘మ్మత్తు’ రాజకీయాల్లో కండువాలు కప్పే తీరే హైలెట్ అని చెప్పాలి. రాష్ట్ర రాజకీయాలను హుజురాబాద్ బై పోల్స్ భవిష్యత్తులో ప్రభావితం చేస్తాయో లేదో దేవుడెరుగు కానీ.. ఇక్కడ పార్టీల్లో నేతలను చేర్పించుకుంటున్న తీరు మాత్రం స్టేట్‌లోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందేమో. ఫిరాయించే వారు ప్లేట్లు ఫిరాయిస్తూనే ఉన్నా జంప్ జిలానీలపై ఇప్పటి వరకు ఆయా పొలిటికల్ పార్టీ లీడర్స్ కప్పిన కండువాల సంఖ్య 4.50 లక్షల నుండి 5 లక్షల వరకూ ఉంటాయని ఓ అంచనా.

తమ పార్టీలో ఇంతమంది చేరారని ప్రకటించిన గణాంకాలను పరిశీలిస్తే కేవలం ఒక్క పార్టీలోనే 2 లక్షల మందికి పైగా చేరినట్టు తేలుతోంది. నిత్యం పార్టీలో చేరుతున్న వారిపై ఆయా పార్టీల నాయకులు తమ పార్టీ కండువాలు కప్పేందు కోసం గంటల తరబడి సమయం కేటాయిస్తున్నారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గం మొత్తంలో 2.36 లక్షల ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు సుమారు నాలుగున్నర లక్షల మందిని అన్నీ పార్టీల వారు జాయిన్ చేసుకొని ఉంటారు. ఓటర్ల సంఖ్యకు రెట్టింపు జనాన్ని ఎలా చేర్పించుకుంటున్నారన్నదే బిగ్ ట్విస్ట్‌గా మారింది.

సామాన్యులే లేరా..

హుజురాబాద్‌లో పార్టీలు ఫిరాయించిన వారి గణాంకాలు పరిశీలిస్తే ఇక్కడ సామాన్య జనమే లేరని స్పష్టమవుతోంది. సగటు పౌరులు కూడా ఏదో పార్టీతో అనుబంధం పెట్టుకున్నవారేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా రాజకీయాల్లో తిరిగే వారి సంఖ్య 25 శాతానికి మించదు. మిగతా వారంతా కూడా వారి వారి వ్యవహారాలకే పరిమితం అవుతుంటారు. ఎన్నికల్లో ఓటు వేసి సాధారణ జీవనం గడుపుతుంటారు. గృహిణులు, ఉద్యోగులు, తటస్థంగా ఉండేవారు‌, కూలీలు.. వీరంతా కూడా ఏదో పార్టీలో చేరకుండా జీవనం సాగిస్తుంటారు. అయితే హుజురాబాద్‌లో పార్టీలు ఫిరాయించిన వారి సంఖ్యను గమనిస్తే వీరంతా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అటు ఇటైనా..

హుజురాబాద్‌లో ఈ పార్టీలో చేరిన వ్యక్తి మరో పార్టీలో చేరి, ఆ పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్లి.. తిరిగి అదే పార్టీలో చేరే తంతు సాగుతోందన్న చర్చ ఓ వైపున జరుగుతోంది. లేక ఆన్ని పార్టీల నాయకులను ఇక్కడి వారు కావాలనే మిస్ గైడ్ చేస్తున్నారా అన్నదే మిస్టరీ.

ద్వితీయ శ్రేణి అత్యుత్సాహం..

ద్వితీయ శ్రేణి నాయకుల అత్యుత్సాహం కూడా ఎక్కువైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత దృష్టిలో పడాలని చేస్తున్న ప్రయత్నాల వల్లే జంప్ జిలానీలకు ఆజ్యం పోస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు పోటీ పడి మరీ జాయినింగ్ ప్రోగ్రామ్స్‌కు శ్రీకారం చుడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ హుజురాబాద్ మరో రికార్డు సృష్టింస్తోదన్నది మాత్రం వాస్తవం.

Advertisement

Next Story

Most Viewed