మరో 75 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు

by Shyam |
మరో 75 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు
X

దిశ, సిటీ బ్యూరో: కరోనా నివారణ కోసం మహానగరంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసేందుకు వీలుగా టీకాలు వేసే ప్రక్రియను బల్దియా మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే వంద వ్యాక్సినేషన్ కేంద్రాలు వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మరో 75 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. అతి త్వరలోనే అదనంగా మరో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి, వీటి సంఖ్యను కూడా వందకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రతి రోజు 300 మందికి వ్యాక్సినేషన్ చేయాలన్న లక్ష్యాన్ని కూడా విధించినట్లు తెలిపారు.

ఈ మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సమకూర్చినా, వీటిని ఏఏ ప్రాంతాల్లో ఏ సమయాల్లో వినియోగించుకోవాలన్న విషయాన్ని బల్దియా అధికారులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కొవిడ్ ను అతి వేగంగా స్ప్రెడ్ చేసే వ్యాపారులు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు వంటి వారికి వారు పనులకు వెళ్లే సమయంలో, వ్యాపారాలను ప్రారంభించే సమయాల్లో అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో వీటి పని వేళలను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్ణయించినట్లు తెలిపారు.

మరో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే, మహానగరవాసులకు టీకాలు వేయటానికి మొత్తం 200 కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఊపందుకుని, నగరవాసులందరికీ కొవిడ్ భయం నుంచి విముక్తి కల్గించినట్టవుతోందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదివరకే ఏర్పాటు చేసిన వంద వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కొన్నింటిని ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేసినందున, వాటిల్లో ఏదైనా ఫంక్షన్ ఉన్న రోజున అదే ఫంక్షన్ హాల్ లో ఓ బాగంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు, ఈ ఫంక్షన్ల కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొంత అంతరాయమేర్పడుతుందని అధికారులు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed