- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అడవి బిడ్డల కోసం.. కీకారణ్యంలో ఏఎన్ఎం సాహసం!
అదో దట్టమైన అటవీ ప్రాంతం.. ఎటుచూసినా ఆకాశాన్నంటుతున్న వనాలు, పక్షుల కిలకిలలు, వన్యప్రాణుల అరుపులే తప్ప, నర మానవుడు కూడా అక్కడ కనిపించడు. అంతటి భయానక వాతావరణంలో చెట్లు, పుట్టల నడుమ ఒక మహిళ.. ఓ చేతితో డబ్బా పట్టుకుని, మరో చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడుస్తోంది. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7 కిలోమీటర్లు నడిచింది. ఒంటరిగా వెళ్తున్నానన్న భయం వెంటాడుతున్నా, తన లక్ష్యం కోసమే ముందుకు సాగింది. చివరకు తన విధులను నిర్వర్తించి వెనుదిరిగింది. -దిశ ప్రతినిధి, కరీంనగర్
భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం, రేగులగూడెం సబ్ సెంటర్లలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న జ్ఞానేశ్వరి.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కనీసం రహదారి సౌకర్యం కూడా లేనటువంటి మారుమూల గ్రామమైన మద్దిమడుగుకు వెళ్లాలంటే ప్రహసనమే. రేగులగూడెం సబ్ సెంటర్ పరిధిలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం ఉన్నా, మద్దిమడుగుకు మాత్రం ఎలాంటి కమ్యూనికేషన్లు ఉండవు. ఇక అక్కడి అడవి బిడ్డలకు చుక్కల మందు వేయాలంటే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చాల్సిందే. కాగా ఏఎన్ఎం జ్ఞానేశ్వరి ఈ కష్టాలన్నీ దాటుకొని వెళ్లి అక్కడి పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేసింది.
20 ఏళ్ల క్రితం..
సింగారం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు దాదాపు 20 ఏళ్ల క్రితం చత్తీస్‌ఘడ్‌లోని గొత్తికోయలు పెద్ద సంఖ్యలో వలసొచ్చారు. వీరంతా సింగారం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. మద్దిమడుగు గ్రామంలో కూడా దాదాపు 42 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కీకారణ్యంలో నివసిస్తున్న ఈ ఆదివాసీ బిడ్డలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు అస్సలే ఉండవు. వేసవి కాలంలో అయితే బైక్ లేదా ట్రాక్టర్ల ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ వర్షాకాలంలో అయితే ఎడ్లబండిపై లేదంటే కాలినడకన వెళ్లాల్సిందే తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి. దీంతో రేగులగూడెం సబ్ సెంటర్‌లో ఏఎన్ఎంగా పనిచేస్తున్న జ్ఞానేశ్వరి తన భర్త భాస్కర్ సాయంతో వ్యాక్సినేషన్, పల్స్ పోలియో వంటి కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు వెళ్లి వస్తుంటుంది.
చెట్లకు సెల్ ఫోన్..
మద్దిమడుగు గ్రామానికి వెళ్లి సేవలందించాలన్నా, నిత్యం అడవుల్లో తిరుగుతూ అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ జీవనం సాగించే గూడెంవాసులకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నా ఇబ్బందే. ఈ గ్రామానికి చెందిన ఒకరికి మొబైల్ ఫోన్ ఉన్నా, అక్కడ సరిగా సిగ్నల్స్ రావు. దీంతో ఆయన మొబైల్‌ను చెట్టుకు వేలాడదీస్తారు. ఏఎన్‌ఎం జ్ఞానేశ్వరి మద్దిమడుగుకు వెళ్లాలనుకున్నప్పుడు ముందుగా అతడి సెల్ ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి ఫలానా రోజున వస్తానని సమాచారం ఇస్తున్నారు. ఆయన గ్రామస్థులకు మందులు ఇచ్చేందుకు వస్తున్న విషయం చెప్పగానే ఆదివాసీలందరూ ఆ రోజు అడవికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతారు. ఈ ఒక్క గ్రామంలో ఉన్న 38 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఒక రోజంతా కష్టపడితే గానీ పూర్తయ్యే పరిస్థితి లేదు.
దశాబ్ద కాలంగా..
దాదాపు 10 ఏళ్లుగా ఏఎన్ఎంగా సేవలందిస్తున్న జ్ఞానేశ్వరి పుట్టినిల్లు మహాముత్తారం మండలంలోని కనుకునూరు కాగా, మెట్టినిల్లు పోచంపల్లి కావడం విశేషం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం రాగానే చాలామంది తమ ప్రాంతానికి సేవలందించడం కంటే, తమ కుటుంబం బాగుండాలనే భావిస్తారు. ఉద్యోగం రాగానే పట్నం వైపు పరుగులు పెడుతుంటారు. కానీ ఈమె మాత్రం తన సేవలను పుట్టిపెరిగిన తమ ప్రాంతవాసులకే పదేళ్ళుగా అందించడం విశేషమనే చెప్పాలి.
కష్టమైనా తప్పని పరిస్థితి..
వాగులు, వంకలు, అడవులు దాటుకుంటూ సేవలందించడంలో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అయినా నా ప్రాంతవాసుల కోసం ఈ ప్రాంతంలోనే ఉద్యోగం చేయాలని భావించా. పుట్టి పెరిగిన ప్రాంతం కావడం, పరిచయాలు ఉండటం వల్లే వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. అయితే మద్దిమడుగు లాంటి గ్రామాలకు వెళ్లిరావడానికి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నా భర్త భాస్కర్ బాసటగా నిలుస్తుండటం వల్లే తరచూ అక్కడి ప్రజలకు సేవలందించగలుగుతున్నాను.
– జ్ఞానేశ్వరి, ఏఎన్ఎం, రేగులగూడెం, మహాముత్తారం