అమ్మకానికి అంగన్‌వాడీ పోస్టులు..? భారీగా క్యూ కట్టిన అభ్యర్థులు..

by Anukaran |   ( Updated:2021-07-18 23:21:02.0  )
anganwadi-posts
X

దిశ, చిట్యాల : అంగన్‌వాడీ పోస్టులను అధికార పార్టీ కింది స్థాయి నాయకులు బేరం పెట్టారు. దీంతో అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు కూడా దళారులతో ముందస్తుగా ఒప్పందం చేసుకుని రూ.లక్షలు చెల్లించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. అన్ని అర్హతలు ఉన్నాయి. పోస్టు వస్తుందన్న విశ్వాసం ఉన్న అభ్యర్థులు సైతం ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని దళారుల మాయలో పడి డబ్బులు సమర్పించుకుంటున్నారు. అంగన్‌వాడీ పోస్టులను అమ్మకానికి పెట్టిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఫలానా గ్రామానికి చెందిన పోస్టులు, ఫలానా వారికే ఇవ్వాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కీలక నేతలపై ఒత్తిళ్లు పెంచుతున్నారు.

135 పోస్టులకు నోటిఫికేషన్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈసారి అంగన్‌వాడీ పోస్టులకు నిరుద్యోగులు భారీగానే పోటీపడుతునట్లు తెలుస్తోంది. జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న 135 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ ఆయాలు, మినీ అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జులై 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు.

ఒక్కో పోస్టుకు లక్ష డిమాండ్..?

అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన కొన్ని రోజుల్లోనే ఆశావహులు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు లక్ష డిమాండ్ చేస్తూ ఉద్యోగం వచ్చేలా చేస్తామని హామీ ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 135 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి లక్షల్లో ముడుపులు సమర్పించుకోవడం గమనార్హం.

పారదర్శకమా..? రాజకీయమా..?

అంగన్‌వాడీ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందా? రాజకీయ పైరవీలకు తలొగ్గి భర్తీ చేస్తారా? అన్న దానిపైనే ప్రస్తుతం చర్చ మొదలైంది. ఇంతకాలం నియామకాల నోటిఫికేషన్‌ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పని ముగిసింది. దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థులందరూ నియామకాల ప్రక్రియపైనే దృష్టి సారించారు. పోస్టులకు పోటీ కూడా అధికంగా ఉంది. పైగా ఈ పోస్టుల ఎంపికపై రాజకీయ ఒత్తిళ్లు అధికంగానే ఉంటాయి. అలాంటప్పుడు ఆశావహుల్లో తమకు దక్కుతుందో లేదోనన్న ఆందోళన మొదలైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పరిస్థితుల్లో అధికారులు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా అర్హులైన వారికి అవకాశం కల్పిస్తారా? రాజకీయ నేతలు చెప్పిన వారికి పోస్టులు కట్టబెడతారో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed