సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

by Sridhar Babu |
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, కొత్తగూడెం : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలను పెంచాలని, ఈఎస్ఐ ను అమలు చేయాలని, సంక్రాంతి పండుగ నేపథ్యంలో తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆందోళన నిర్వహించారు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద రుద్రంపూర్ లో కాంట్రాక్టు కార్మికులు గురువారం ధర్నా చేశారు.

ఈ సందర్భంగా జీఎం సాలెం రాజుకి నాయకులు వినతి పత్రం సమర్పించారు. సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వీరస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, గతంలో 18 రోజుల సమ్మె సందర్భంగా అయిన ఒప్పందంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని, ఆరు నెలల ఈపీఎఫ్ డబ్బులను తక్షణమే చెల్లించి అందరికీ ఈపీఎఫ్ కార్డులు ఇవ్వాలని, సీఎంపీఎఫ్ పాస్​ బుక్కులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వేతనాలను ప్రతినెలా సకాలంలో చెల్లించాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కామ్రేడ్ జి .వీరస్వామి, కేజీఎం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, కేజీఎం ఏరియా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కత్తర్ల రాములు, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.సుధాకర్, బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సంద బోయిన శ్రీనివాస్, బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు బండారి మల్లయ్య, వీకే వర్క్ షాప్ ఫిట్ కార్యదర్శి ఎం.మధు కృష్ణ, ఏరియా స్టోర్స్ ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్, గౌరీ వరప్రసాద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story