Kadapa: ఆడపిల్ల భారం కాదు.. ఆణిముత్యం

by srinivas |
Kadapa: ఆడపిల్ల భారం కాదు.. ఆణిముత్యం
X

దిశ, కడప: "పెళ్లంటే నూరేళ్ళ పంట. పరిణితి చెందిన వయస్సులో జరిగితేనే ఆ కాపురం కలతలు, కష్టాలు లేని కుటుంబం అవుతుంది. అభం శుభం తెలియని వయస్సులో చేసే బాల్యవివాహాలు బాలికల బంగారు భవిష్యత్తుకు అవరోధాలుగా మారుతున్నాయి. ఈ అవరోధాలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం "బాల్య వివాహ నిషేధ చట్టం - 2006" పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు కడప జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ, వివిధ శాఖల భాగస్వామ్యంతో చాలా కార్యక్రమాలను చేపడుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు

‘ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడుతారు. బుడి బుడి అడుగులతో ఇళ్లంతా కలియదిరుగుతుంటే సందడి అంతా ఇంతాకాదు. కానీ, బాలికలకు సరైన వయస్సు రాకముందే పెళ్లి చేసి తమ భారం దించుకునేందుకు కొందరు తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదువుకునే వయస్సులోనే వివాహ బంధం పేరుతో బంధనం వేస్తున్నారు. ఉన్నత చదువులు చదివించకుండా, ఉద్యోగాలు చేయనీయకుండా 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లిచేసి చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నారు.’ అని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖతో పాటు వివిధ శాఖల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎవరి దృష్టికైనా వస్తే హెల్ప్ లైన్‌ నంబర్ల ద్వారా వెంటనే సమాచారాన్ని అందుకునే నెట్ వర్క్‌ను డెవెలప్‌చేయడం జరిగిందని తెలిపారు.. ఇలా సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వివాహాలను అడ్డుకుంటారన్నారు. ఆడపిల్ల భారం కాదని, భవితకు ఆధారం అని పేర్కొన్నారు .అమ్మాయికి 18, అబ్బాయికి 21 నిండిన తర్వాతే వివాహం చేయాలని కలెక్టర్ విజయరామరాజు సూచించారు.

Advertisement

Next Story