Kadapa: కొప్పర్తిలో డిక్సన్ ఉత్పత్తులు ప్రారంభం.. పరిశీలించిన ఎంపీ అవినాశ్

by srinivas |
Kadapa: కొప్పర్తిలో డిక్సన్ ఉత్పత్తులు ప్రారంభం.. పరిశీలించిన ఎంపీ అవినాశ్
X

దిశ, ప్రతినిధి కడప: కడప నగరానికి సమీపంలో ఉన్న కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులో డిక్సన్ ఎలక్ట్రానిక్ సంస్థ తన ఉత్పత్తులను ప్రారంభించింది. ఈ ఇండస్ట్రియల్ పార్కులోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈ ఎం సి)లో డిక్సన్ సంస్థ తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసింది. పారిశ్రామక వాడలో ఎలక్ట్రానిక్ వెలుగులు విరజిమ్మేలా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో భాగంగా డిక్సన్ సంస్థ తన ఉత్పత్తులైన సీసీ కెమెరాలు మొదటిగా ప్రారంభించింది. 554 ఎకరాల్లో ఏర్పాటైన జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.


డిక్షన్ సంస్థ 2021 డిసెంబర్ 31న ఇక్కడ పరిశ్రమకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 127 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 1800 మందికి, పరోక్షంగా 1200 మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ ద్వారా సర్వో లైన్స్, ల్యాప్ లాప్‌లు, టీవీలు, డిజిటల్ వీడియో రికార్డర్స్ , టాబ్‌లు, సీసీ కెమెరాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది.10 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు

ఈ‌సంస్థ మొదటిగా సిసి కెమెరాల ఉత్పత్తి అయిన సందర్భంగా కడప ఎంపి అవినాష్, కలెక్టర్ విజయరామరాజు, ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి తదితరులు పరిశీలించారు. సీసీ కెమెరా ఉత్పత్తి ,నాణ్యతలను పరిశీలించడంతోపాటు అక్కడి సదుపాయాలు పై యాజమాన్యంతో చర్చించారు. సంస్థకు ఏమైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Advertisement

Next Story