కడప పార్లమెంట్ స్థానంపై వైసీపీ, టీడీపీ కసరత్తు

by Mahesh |
కడప పార్లమెంట్ స్థానంపై వైసీపీ, టీడీపీ కసరత్తు
X

దిశ, కడప ప్రతినిధి: రాష్ట్రంలో కడప జిల్లా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం. అయితే ఈ సారి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత, ప్రస్తుత శాసన సభ్యులు వరుసగా రెండు సార్లు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించడం, చంద్రబాబు అరెస్టు అంశాలు రానున్న ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయనే టీడీపీ ఆశిస్తోంది. మరో వైపు కొద్ది నెలల క్రితం చంద్రబాబుతో పాటు, నారా లోకేష్ పర్యటనలు కడపలో విజయవంతం కావడం లాంటి పరిస్థితులు ఆ పార్టీలో కొంత ఊపునిచ్చాయి .

వివేకా హత్య ప్రభావం చూపేనా ?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య తమ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారని ఇప్పటికే టీడీపీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతోంది. కడప పార్లమెంట్ లో కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం బద్వేలు నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15,96,923 మంది పురుష, మహిళ, 246 ట్రాన్స్ జెండర్ల ఓట్లు ఉన్నాయి.

నాడు కమ్యూనిస్టులు..నేడు వైఎస్ కుటుంబం

కడప పార్లమెంట్ స్థానానికి మొట్టమొదటిసారిగా 1952 లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి వై ఈశ్వర్ రెడ్డి గెలుపొందారు. అనంతరం 1971, 1967,1962 ఎన్నికల్లోనూ ఆయననే ప్రజలు ఎన్నుకున్నారు. 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున వీ రామిరెడ్డి, 1977, 1980 ఎన్నికల్లో కందుల ఓబుల్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1984 టీడీపీ అభ్యర్థి డీ నారాయణరెడ్డి (డి.ఎన్ రెడ్డి) విజయం సాధించారు. అక్కడ నుంచి 1989,1991,1996, 1998 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 1999, 2004 ఎన్నికల్లో వివేకానందరెడ్డి, 2009, 2011లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు.

ఈ సారైనా టీడీపీ ?

ఈ సారైనా కడప పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు ప్రారంభించింది. కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డిని అధిష్టానం ప్రకటించింది. ఆయన సతీమణి ఆర్ మాధవి రెడ్డిని కడప అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించింది. శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ కు పోటీ చేసే విషయంలో డోలాయమానంలో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయకపోతే బలమైన అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే కే విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డితోపాటు మరి కొందరి పేర్లు పరిశీలిస్తోంది. ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు నియోజకవర్గాల్లో మెజార్టీ లభిస్తోంది. ఇప్పటికే ఈ స్థానాల్లో టీడీపీ ఇన్చార్జిలను నియమించింది. దీంతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విజయం సాధించడం కూడా టీడీపీకి కలిసొచ్చే అంశంగా కనబడుతోంది.

Advertisement

Next Story